Begin typing your search above and press return to search.

ట్రంప్ ఉన్న హోటల్‌ ను క‌మ్మేసిన భ‌ద్ర‌తా సిబ్బంది!

By:  Tupaki Desk   |   24 Feb 2020 1:46 PM GMT
ట్రంప్ ఉన్న హోటల్‌ ను క‌మ్మేసిన భ‌ద్ర‌తా సిబ్బంది!
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. అగ్ర‌రాజ్య అధ్యక్షుడి కోసం భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో పాటు అమెరికా ప్రత్యేక భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అడుగ‌డుగునా ప‌హారా కాస్తున్నాయి. ట్రంప్ అహ్మ‌దాబాద్ విమానాశ్ర‌యంలో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి ఢిల్లీలోని పాలం విమానాశ్ర‌యానికి చేరుకునే వ‌ర‌కు ఇరు దేశాల భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆయ‌న వెన్నంటి ఉన్నాయి. ఇక‌, ఢిల్లీలో ట్రంప్ బ‌స చేయనున్న ఐటిసి మౌర్య హోటల్ ద‌గ్గ‌ర క‌నీవిని ఎరుగ‌ని రీతిలో భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు.

ట్రంప్ పర్య‌ట‌న నేప‌థ్యంలో ఢిల్లీలోని ఐటిసి మౌర్య హోట‌ల్‌ లోకి చీమ కూడా దూర‌డానికి అవ‌కాశం లేద‌న్న‌ట్లుగా భ‌ద్ర‌తా సిబ్బంది ప‌హారా కాస్తున్నారు. హోటల్‌కు వెళ్లే అన్ని దారుల‌ను జ‌ల్లెడ‌ప‌డుతున్నారు. భార‌త సైన్యం - పారామిలటరీ దళాల ప్రత్యేక నిపుణుల బృందాలు అన్ని వాహ‌నాల‌ను ముమ్మ‌రంగా తనిఖీలు చేస్తున్నాయి. మ‌రోవైపు, హోటల్ పరిసర ప్రాంతాలు - రహదారులను “అమెరికా సీక్రెట్ సర్వీస్” సమన్వయంతో భారత రక్షణ బృందాలు పహారా కాస్తున్నాయి. అనుమానాస్ప‌ద డ్రోన్ల” ను ఛేదించేందుకు ఎన్.ఎస్.జి స్నైపర్ షూటర్లు,“స్వాట్” కమెండోలు - “షార్ప్ షూటర్స్” - వైర్లెస్ వ్యవస్థ - జి.పి.ఆర్.సి సదుపాయం ఏర్పాటు చేశారు.

“పరాక్రమ్” వ్యాన్లు - ప్రత్యేక శిక్షణ పొందిన శునకాలు - కేంద్ర సాయుధ బలగాల‌కు చెందిన సుమారు 5 వేల మంది పహారా కాస్తున్నారు. మౌర్య హోటల్‌కు వెళ్లే దారిలో ఉన్న‌ “సర్దార్ పటేల్ మార్గ్” లో హైడిఫనిషన్ సిసిటివి లను భారీగా ఏర్పాటు చేశారు. మూడంచెల రక్షణ కవచాన్ని హోటల్ చుట్టూ ఏర్పాటు చేశారు. సిమెంటుతో త‌యారు చేసిన “జెర్సీ” బారికేడ్స్ ను రహ‌దారలలో వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. సాయుధ బలగాలతో కూడిన హెలీకాప్టర్ల సర్వేలెన్స్ ను కూడా నిర్వహిస్తున్నారు. మొత్తంగా...ట్రంప్ ఒక్క‌రోజు భ‌ద్ర‌త కోసం దాదాపు ప‌ది వేల మంది భ‌ద్ర‌తా సిబ్బంది కంటి మీద కునుకు వేయ‌కుండా కాప‌లా కాస్తున్నారు.