Begin typing your search above and press return to search.

బీజేపీ అభ్యర్ధులకు మాత్రం పెరిగిన భద్రత

By:  Tupaki Desk   |   17 Feb 2022 5:31 AM GMT
బీజేపీ అభ్యర్ధులకు మాత్రం పెరిగిన భద్రత
X
ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. కేంద్రం నుండి అదనపు భద్రత పొందిన వారిలో ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు అభ్యర్ధులు, పంజాబ్ లో 21 మంది అభ్యర్ధులున్నారు. వీరి ప్రాణాలకు ఆపద ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం మేరకు కేంద్రం వీరికి జడ్, వై, ఎక్స్ కేటగిరి భద్రతను కల్పించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది.

ఎందుకంటే ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్న ఇతర పార్టీల్లోని కొంతమంది అభ్యర్థుల విషయాన్ని మాత్రం కేంద్రం పట్టించుకోవడం లేదు. పంజాబ్ ఎన్నికల విషయంలో పాకిస్ధాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ప్రేరేపిత సిక్కు ఉగ్రవాద సంస్థల నుంచి కొందరు అభ్యర్ధులకు హాని కలిగే అవకాశముందని నిఘావర్గాలు సమాచారం ఇచ్చాయి. పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్ లో జరగబోయే ర్యాలీల్లో కొందరు అభ్యర్థులు, వీవీఐపీలు, నేతలను సిక్కు తీవ్రవాద సంస్ధలు టార్గెట్ చేసుకునే అవకాశాలున్నాయని నిఘావర్గాలు చెప్పాయి.

యూపీలో పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి బఘేల్ కు హోంశాఖ జడ్ క్యాటగిరీ భద్రత కల్పించింది. మరో అభ్యర్థి బీజేపీ సిట్టింగ్ ఎంపీ డాక్టర్ రమేష్ చంద్ ఎక్స్ క్యాటగిరి, పంజాబ్ లో పోటీ చేస్తున్న 21 మంది అభ్యర్థులకు వై క్యాటగిరి భద్రతను కేంద్రం కల్పించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల అనగానే నేతలంతా పోలోమంటు జనాల్లోకి వెళిపోవటం సహజం. అప్పుడు ప్రత్యర్ధులకో లేకపోతే ఉగ్రవాద సంస్ధలో ఈజీగా టార్గెట్ అయిపోతారు.

ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కళ్ళు అదనపు భద్రతను కోరుకుంటారు. అయితే కేంద్రం మాత్రం తమ అభ్యర్ధులకు మాత్రమే అదనపు భద్రత కల్పించి మిగిలిన వాళ్ళను గాలికొదిలేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఏదో రకంగా అదనపు భద్రతను తీసుకుంటారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), శిరోమణి అకాలీదళ్-బీఎస్పీ కూటమి అభ్యర్ధులు, స్వతంత్ర అభ్యర్ధుల భద్రత మాటేమిటి ?ఇక్కడే కేంద్రం వైఖరిపై మండిపోతున్నారు.

సరే ఎవరేమనుకుంటే ఏమిటిలే అనే వైఖరితోనే కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.