Begin typing your search above and press return to search.

ఇవాంకా వ‌స్తోంది..ఇంకే విమానాలు దిగ‌కూడ‌దు

By:  Tupaki Desk   |   23 Nov 2017 7:50 AM GMT
ఇవాంకా వ‌స్తోంది..ఇంకే విమానాలు దిగ‌కూడ‌దు
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య ఇవాంకా న‌గ‌ర ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా విధించే అనేక ష‌ర‌తుల‌తో అవాక్క‌య్యే రీతిలో ఉన్నాయి. ఇప్ప‌టికే ఆమె టూర్ నేప‌థ్యంలో న‌గ‌ర ర‌వాణ వ్య‌వ‌స్థ‌ - సామాన్యుల జ‌న‌జీవ‌నం స్తంభించే ప‌రిస్థితులు క‌నిపిస్తుండ‌గా...ఇప్పుడు అది ఆకాశ‌మార్గానికి కూడా చేరింది. ఔను!ఇవాంకా వ‌చ్చే విమానం శంషాబాద్‌ లోని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌మ‌యంలోకి దిగే ముందు, దిగిన త‌ర్వాత సుమారు 5 గంట‌ల పాటు మ‌రే విమానం హైద‌రాబాద్‌ లో దిగ‌కుండా చూడాల‌ని యునైటెడ్‌ స్టేట్స్‌ సీక్రెట్‌ సర్వీస్‌ (యూఎస్‌ ఎస్‌ ఎస్‌) ప్రతినిధుల ఆదేశాలు జారీ చేశార‌ట‌.

అయితే ఈ ఆదేశాల‌ను చూసి అవాక్క‌వ‌టం శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ వర్గాల వంతైంది. 5 గంట‌ల పాట విమానాల‌ను నిలిపివేయ‌డం చాలా చిక్కుల‌కు కార‌ణం అవుతుంద‌ని...ఇది ప్ర‌యాణికుల నుంచి విమ‌ర్శ‌లకు దారితీస్తుంద‌ని తెలుపుతూ వారు యూఎస్‌ ఎస్‌ ఎస్ అధికారుల‌కు తేల్చిచెప్పార‌ట‌. మ‌రోవైపు ఇంటెలిజెన్స్ బ్యూరో సైతం శంషాబాద్ విమానాశ్ర‌యం అంత సుర‌క్షితం కాద‌ని చెప్ప‌డంతో....యూఎస్‌ ఎస్‌ ఎస్ వ‌ర్గాలు మ‌న‌సు మార్చుకొని బేగంపేట విమానాశ్ర‌యాన్ని ఎంచుకున్నార‌ని స‌మాచారం. మ‌రోవైపు ఇవాంకా వస్తున్న ప్రత్యేక విమానంలోనే ఆధునాతన జామర్లు, ఇతర ఆధునిక పరికరాలు ఉన్న మూడు మైన్‌ రెసిస్టెంట్స్‌ వెహికిల్స్‌ (ఎంఆర్‌ వీ) తీసుకువ‌స్తున్నారు. ఈ వాహనాల్లోనే ఇవాంకా హైదరాబాద్‌ లో పర్యటించనున్నారు.

మ‌రోవైపు పోలీస్ వ‌ర్గాలు నగరం అంతా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ప్రధానంగా సభకు కీలక అతిధులుగా శ్వేతసౌధం సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్ - భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతున్న దృష్ట్యా భద్రతను భారతీయ రక్షణ బృందాలు - అమెరికా నుండి చేరుకున్న ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో అమెరికా ప్రత్యేక భద్రతా బృందం కూడా హైదరాబాద్ చేరుకోనుంది. ఇప్పటికే ఎస్‌ పిజి - స్థానిక పోలీసులు రూట్‌ లను చెక్ చేశారు. కీలక సదస్సుతో అదే రోజు మధ్యాహ్నం భారత ప్రధాని నరేంద్రమోడీ మెట్రో రైలును కూడా ప్రారంభించనున్న దృష్ట్యా భద్రతా దళాలు, రక్షణ దళాలు వేర్వేరుగా నగరం అంతా జల్లెడపడుతున్నాయి. ఇంకో పక్క అమెరికాకు చెందిన 25 మంది అధికారులు ఇప్పటికే నగరంలో రక్షణ పరిస్థితులను సమీక్షిస్తున్నారు.