Begin typing your search above and press return to search.

మాజీ ఎంపీ ర‌మ్య‌పై రాజ‌ద్రోహం కేసు!

By:  Tupaki Desk   |   26 Sep 2018 2:23 PM GMT
మాజీ ఎంపీ ర‌మ్య‌పై రాజ‌ద్రోహం కేసు!
X
త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా చీఫ్‌ - ప్రముఖ నటి - మాజీ ఎంపీ రమ్యకు(దివ్య స్పందన) నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు. అవ‌కాశం దొరికిన‌పుడ‌ల్లా బీజేపీ - ప్ర‌ధాని మోదీ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు. గ‌తంలో బెంగుళూరులో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ....మ‌త్తులో ప్ర‌సంగించార‌ని రమ్య చేసిన వ్యాఖ్య‌లు పెనుదుమారం రేపాయి. ఆ త‌ర్వాత సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ లను గురించి ఆమె ప్ర‌సంగిస్తున్న వీడియో ఒక‌టి లీక్ కావ‌డంతో ఆమెపై బీజేపీ విరుచుకుప‌డింది. ఫేక్ అకౌంట్ల‌ను ఆమె ప్రోత్స‌హిస్తోంద‌ని మండిప‌డింది. తాజాగా మ‌రోసారి మోదీపై ర‌మ్య షాకింగ్ కామెంట్స్ చేసింది. మోదీ తనను పోలిన మరో రూపంపై చోర్‌ అని రాసుకుంటున్నట్టు ఉన్న ఓ మార్ఫింగ్‌ ఫొటోను రమ్య ట్వీట్ చేసింది. దీంతో, ప్ర‌ధానిని కించ‌ప‌రిచారంటూ ఉత్తరప్రదేశ్‌ లోని గోమతినగర్‌ పోలీసులు ఆమెపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు.

లక్నోకు చెందిన న్యాయవాది సయీద్‌ రిజ్వాన్‌ అహ్మద్ ...ర‌మ్య‌పై ఫిర్యాదు చేశారు. ప్రధాని ఖ్యాతిని దిగజార్చేలా రమ్య ట్వీట్‌ చేశారు. ప్రధాని పట్ల ఆమెకు గల ద్వేషాన్ని ఇది తెలియజేస్తుంద‌ని రిజ్వాన్ ఆరోపించారు. ప్రధానిని అంతర్జాతీయంగా చులకన చేసే విధంగా ఈ ట్వీట్ ఉంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ప్ర‌కారం రమ్యపై ఐపీసీ సెక్షన్‌ 124-ఏ(రాజద్రోహం)తోపాటు - సెక్షన్‌ 67(ఐటీ యాక్ట్‌) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ర‌మ్య‌పై కేసు నమోదైన‌ట్టు వచ్చిన వార్తపై రమ్య వ్యంగ్యంగా స్పందించారు. త‌నపై కేసు న‌మోదవ‌డం మంచిద‌ని ఆమె వ్యాఖ్యానించారు. ఓ వైపు, రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై బీజేపీ - కాంగ్రెస్‌ ల మధ్య మాటల యుద్ధం కోనసాగుతున్న నేప‌థ్యంలో ర‌మ్య‌పై కేసు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. బీజేపీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ రాఫెల్ ను వాడుతోన్న సంగ‌తి తెలిసిందే.