Begin typing your search above and press return to search.

సీమ బంద్ తో చంద్రబాబుకు డేంజర్ బెల్స్ ?

By:  Tupaki Desk   |   24 May 2017 7:38 AM GMT
సీమ బంద్ తో చంద్రబాబుకు డేంజర్ బెల్స్ ?
X
కరవు సమస్యల పరిష్కారం కోసం వామపక్షాల పిలుపు మేరకు జరుగుతున్న రాయలసీమ బంద్ ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇది ఉద్ధృత రూపం దాల్చింది. బంద్ కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడం.. పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా కావడంతో అనంతపురంలో బంద్ విజయవంతమైంది. అనంతపురంలో పలు చోట్ల బస్సులలో గాలి తీసేసిన ఆందోళన కారులు పలు బ్యాంకులపై రాళ్లు రువ్వారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బంద్‌ కారణంగా జేఎన్టీయూ-అనంతపురం పరిధిలో ఈ రోజు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. గుంతకల్లులో నిరసనకారులు రోడ్లపైకి వచ్చిన బస్సులను ధ్వంసం చేశారు. అద్దాలు పగులగొట్టారు.

కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కరువు సమస్యలు పరిష్కరించాలంటూ వామపక్షాలు ఈ ఆందోళనకు తలపెట్టాయి. సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. నాలుగు జిల్లాలో వామపక్ష నేతలు బస్సులను అడ్డుకున్నారు. దీంతో ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలో బస్సులను అడ్డుకున్న వామపక్షాలు, కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

టెంపుల్ టౌన్ తిరుపతిలో బస్టాండు ముందు వామపక్ష కార్యకర్తలు నిరసనలకు దిగి డిపో నుంచి ఒక్క బస్సును కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో తిరుమలకు వెళ్లాలని వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మదనపల్లి, పీలేరు, కదిరి, గుత్తి, డోన్ తదితర ప్రాంతాల్లోనూ నిరసనకారులు రోడ్లపైకి వచ్చిన హింసాత్మక ఘటనలకు దిగి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వీరిని అదుపు చేసేందుకు ఎక్కడికక్కడ భారీ ఎత్తున పోలీసులను, ప్రత్యేక బలగాలను మోహరించారు.

చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా ఈ మూడేళ్లలో వామపక్షాలు, కాంగ్రెస్ పలు కార్యక్రమాలు చేపట్టినా ఈ స్థాయిలో ఎన్నడూ సక్సెస్ కాలేదు. కానీ, ఈ రాయలసీమ బంద్ సందర్భంగా మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. విపక్షాలు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంతో ప్రభుత్వంలో ఉలికిపాటు మొదలైంది.