Begin typing your search above and press return to search.

సీమ ప్రాజెక్టులు..జ‌గ‌న్ అదిరిపోయే లెక్క‌లు

By:  Tupaki Desk   |   11 Dec 2019 4:53 PM GMT
సీమ ప్రాజెక్టులు..జ‌గ‌న్ అదిరిపోయే లెక్క‌లు
X
రాయలసీమ ప్రాజెక్టుల విష‌యంలో ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్ చ‌ర్చ జ‌రిగింది. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాయలసీమ ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి నిల్వ పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభకు వివరించారు. ఇంతగా వర్షాలు పడి.. దేవుడు ఈ సంవత్సరం మంచిగా నీళ్లు ఇచ్చినా రాయలసీమ ప్రాజెక్టులకు నింపుకోలేకపోవడంపై సీఎం జగన్‌ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అవుతుందని, కానీ, గత చంద్రబాబు ప్రభుత్వం గడిచిన పరిపాలనలో ప్రాజెక్టుల మీద శ్రద్ధపెట్టి చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే.. రాయలసీమలోని ప్రాజెక్టుల మరమ్మతులు పూర్తిచేసి.. కాల్వల సామర్థ్యాన్ని పెంచి ఉంటే.. ప్రతి బొట్టును ఒడిసిపట్టి ఉండేవాళ్లమని, రాయలసీమ ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు ఉండేవని అన్నారు.

గ‌తంలో, ప్ర‌స్తుత ప‌రిపాల‌న విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ వివరించారు. రాయ‌లసీమలోని ప్రాజెక్టులు మళ్లీ పుష్కలమైన నీళ్లతో కళకళలాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయ‌న తెలిపారు. `పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన చిత్రావతి రిజర్వాయర్‌ ఉంది. బహుశా నా నియోజకవర్గానికి సంబంధించినది కావడమే అది చేసుకున్న పాపమేమోనని అనిపిస్తోంది. ఇన్ని నీళ్లు వచ్చినా, నీళ్లు నింపండి, నింపండి అని పదేపదే చెప్పినా కూడా 10 టీఎంసీలకు గాను 6.8 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయగలిగాం. గండికోట 26.5 టీఎంసీలకుగాను కేవలం 12 టీఎంసీల నీళ్లుమాత్రమే నిల్వచేయగలిగాం. పెన్నా అహోబిలం బాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 11 టీఎంసీలకుగాను ఇవాళ్టికి 3.38 టీఎంసీలు మాత్రమే నింపగలిగాం. బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ 17.93 టీఎంసీలకుగాను కేవలం 6.28 టీఎంసీలు మాత్రమే నిల్వచేయగలిగాం.బ్రహ్మంసాగర్‌కు వెలుగోడు నుంచి వెళ్లే కాల్వలో నీళ్లు సరిపడా పోవడంలేదని, కాల్వ సామర్థ్యం సరిపోలేదని, 5వేల క్యూసెక్కుల నీళ్లు పోవాల్సిన చోట 2వేల క్యూసెక్కులు కూడా పోవడంలేదని, కెనాల్‌ మరమ్మతు చేయండని మా ఎమ్మెల్యే రఘురామిరెడ్డిసహా మేం కూడా పలుమార్లు చెప్పాం. కాని ఐదేళ్లలో విన్న పాపాన పోలేదు` అని జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు గురించి సీఎం జ‌గ‌న్ స‌వివ‌రంగా వివ‌రించారు. ``చంద్రబాబు సీఎంకాకముందు 2004 నుంచి 2014 మధ్యకాలంలో జీఎన్‌ఎస్‌ఎస్‌ (గాలేరు-నగరి సుజల స్రవంతి) ప్రాజెక్టుకు రూ. 5వేల36 కోట్లు ఖర్చు చేశారని, హంద్రీనీవాకు సంబంధించి రూ. ఆరువేల కోట్లు ఖర్చు చేశారని, కానీ, చంద్రబాబు హయాంలో రూ. 198 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, కేవలం ఎన్నికలు వస్తుండటంతో హడావిడిగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పనుల కోసం 420 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఇంకా రూ. 980 కోట్లు అదనంగా ఇచ్చి ఉంటే గండికోట ప్రాజెక్టులో ఈపాటికి నీళ్లు ఉండి ఉండేవి కాదా? గండికోట ప్రాజెక్టుకు సంబంధించి రూ. 980 కోట్లు గతంలో చంద్రబాబు సర్కారు విడుదల చేసి ఉండి ఉంటే.. ఈ రోజు 26 టీఎంసీల నీళ్లు నిల్వచేసి ఉండేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు.

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరి సామర్థ్యాన్ని 44 క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. ``తెలుగు గంగ కెనాల్‌ను 11500 క్యూసెక్కుల నుంచి 18వేల క్యూసెక్కుల వరకు అభివృద్ధి చేయబోతున్నాం. ఎస్సార్‌బీసీ కెనాల్‌ను 21వేల క్యూసెక్కుల నుచి 31వేల వరకు, కేసీ కెనాల్‌ 12500 క్యూసెక్కుల నుంచి 35వేల క్యూసెక్కుల వరకు, అవుకు టన్నెల్‌ కెనాల్‌ 10 క్యూసెక్కుల నుంచి 30వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. హెచ్‌ఎన్‌ఎస్‌ కెనాల్‌ నుంచి 2100 క్యూసెక్కుల కూడానీరు పోవడం లేదు. దానిని ఆరు వేల క్యూసెక్కులకు పెంచుతాం. తెలుగు గంగ మెయిన్‌ కెనాల్‌ టు వైఎస్సార్‌ కడప సామర్థ్యాన్ని 3500 క్యూసెక్కుల నుంచి 8వేల క్యూసెక్కులకు తీసుకెళ్లతాం.`` అని జ‌గ‌న్ వివ‌రించారు