Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లోని సీమాంధ్ర జర్నలిస్టు

By:  Tupaki Desk   |   25 Aug 2015 4:26 AM GMT
హైదరాబాద్ లోని సీమాంధ్ర జర్నలిస్టు
X
సీమాంధ్ర పదం అన్నదే సరికాదని.. తెలంగాణలో ఉన్న వారంతా తెలంగాణ లాంటి వాళ్లేనని ఒకసారి.. తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటానని మరోసారి.. సీమాంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని ఇంకోసారి.. ఇలా తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రుల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలానే చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఉండే వారంతా తెలంగాణ వారే తప్ప మరొకరు కాదని.. అలాంటి వివక్ష ఉండదని తేల్చి చెప్పారు.

ముఖ్యమంత్రి మాటలు విన్న వారు ఈ మాటలు ఊరటనిచ్చాయి. సామాన్య ప్రజల సంగతి తర్వాత.. హైదరాబాద్ లో పని చేస్తున్న సీమాంధ్ర మూలాలు ఉన్న జర్నలిస్టుల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. నిజానికి.. రాష్ట్ర విభజన సమయంలోనూ.. తెలంగాణ ఉద్యమంలోనూ సీమాంధ్ర జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమానికి తమ మద్ధతు.. నైతిక మద్ధతు ప్రకటించిన వారున్నారు.

అంతదాకా ఎందుకు.. 2009కి ముందు టీఆర్ ఎస్ పార్టీ బీట్ ను చూసిన వారిలో తెలంగాణ జర్నలిస్టులతో పాటు.. సీమాంధ్ర మూలాలున్న జర్నలిస్టులు ఉండేవారు. వారంతా కేసీఆర్ చెప్పిన మాటల్ని పొల్లు పోకుండా రాశారే తప్పించి.. కుయుక్తులకు పాల్పడింది లేదు. ఉద్యమానికి సంబంధించి జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని పాటించారే తప్పించి.. వ్యక్తిగత భావోద్వేగాలకు తావివ్వలేదు.

కానీ.. తాజాగా మాత్రం తెలంగాణ ప్రభుత్వం.. జర్నలిస్టులకు ఇవ్వనున్న హెల్త్ కార్డుల జారీలో భారీ వివక్ష చోటు చేసుకోనుందన్న మాట వినిపిస్తోంది. తెలంగాణరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు కొలువు తీరిన తర్వాత జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తానని చెప్పి పదిహేను నెలలు కావొస్తున్నా ఇంత వరకూ ఆ హామీ నెరవేరింది లేదు. ఉద్యమంలో కీలకభూమిక పోషించి.. జర్నలిస్టులకు ఎంతో చేస్తానని చెప్పే కేసీఆర్.. ఇప్పటివరకూ హెల్త్ కార్డుల జారీ కూడా చేయలేదన్న విమర్శ ఉంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో పని చేసే జర్నలిస్టులతో పాటు.. రిటైర్డ్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇష్యూ చేయనున్నట్లు చెబుతూ.. ఒక దరఖాస్తు ఫారాన్ని ఇస్తున్నారు. సదరు అప్లికేషన్ ఫాంలో ఆరో అంశంగా ‘‘ప్లేస్ ఆఫ్ బర్త్’’ అన్న కాలమ్ ఇచ్చారు. ఇక.. అదే దరఖాస్తులో ఏదో అంశంగా ‘‘లోకల్ స్టేటస్’’ కాలమ్ ఇచ్చారు.

ప్లేస్ ఆఫ్ బర్త్ తోనే పలు సందేహాలు పుట్టుకొస్తే.. లోకల్ స్టేటస్ అనే మాటకు అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి. ఇక.. జర్నలిస్టులలో చాలామంది ఏళ్ల తరబడి హైదరాబాద్ లో పని చేస్తూ స్థిరపడిన వారున్నారు. కానీ.. పుట్టింది ఆంధ్రా ప్రాంతంలో అయి ఉంటుంది. అలాంటి వారి పుట్టిన ప్రదేశం అడగటం ద్వారా.. కార్డుల ఇష్యూలో వివక్ష పక్కా అంటున్నారు. నిజానికి డేట్ ఆఫ్ బర్త్ అడగటం తప్పు కాదు కానీ.. ఎక్కడ పుట్టారని అడగటం ద్వారా.. హైదరాబాద్ లోని సీమాంధ్ర మూలాలున్న జర్నలిస్టులకు భారీగా దెబ్బపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఓ పక్క హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్ర జర్నలిస్టులకు ఏపీ సర్కారు చేసిందేమీ లేదు. ఆ మధ్యన హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తామని చెప్పినా బాబు సర్కారు చేసిందేమీ లేదు. నిజానికి.. కొందరు జర్నలిస్టులు అయితే.. హైదరాబాద్ లో స్థిరపడినందున ఏపీ సర్కారు హెల్త్ కార్డుల కోసం దరఖాస్తు చేసింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అటు ఏపీ సర్కారు నిర్లక్ష్యానికి.. ఇటు తెలంగాణ సర్కారు పరిమితుల నేపథ్యంలో హైదరాబాద్ లో పని చేస్తున్న సీమాంధ్ర మూలాలున్న జర్నలిస్టులకు మొత్తంగా దెబ్బ పడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. కడుపులో పెట్టుకొని చూసుకోవటం అంటే ఇదేనా? అని సీమాంధ్ర మూలాలు ఉండి హైదరాబాద్ లో స్థిరపడిన జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.