Begin typing your search above and press return to search.

సీమ టీడీపీలో క‌ల‌క‌లం.. ఇలా అయితే క‌ష్ట‌మే..!

By:  Tupaki Desk   |   19 Sep 2021 2:30 AM GMT
సీమ టీడీపీలో క‌ల‌క‌లం.. ఇలా అయితే క‌ష్ట‌మే..!
X
ఒక‌ప్పుడు రాయ‌ల‌సీమ అంటే.. టీడీపీకి కంచుకోట‌. ఎంతో మంది నాయ‌కులు మంత్రులుగా ప‌నిచేశారు. మేధావి వ‌ర్గంగా.. రాష్ట్ర అభ్యున్న‌తికి కృషి చేశారు. అనేక ఐడియాలు ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా ప‌నిచేసిన కేఈ కృష్ణ‌మూర్తి వంటివారు సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇక‌, ఎంతో మంది మంత్రులుగా చ‌క్రం తిప్పారు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? పార్టీ పుంజుకునేలా ఉందా? అంటే.. లేద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. సీమ‌లోని నాలుగు జిల్లాల్లోనూ.. టీడీపీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితినే ఎదుర్కొం టోంది. గ‌త ఎన్నిక‌ల్లో అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో.. వార‌సులు రంగంలోకి దిగారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న పార్టీ దూకుడు.. పుంజుకుంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

ఇక‌, టీడీపీ అదినేత చంద్ర‌బాబు అయితే.. మ‌రిన్ని అంచ‌నాలు వేసుకున్నారు. అనంత‌, క‌ర్నూలు, చిత్తూరులో పార్టీ ఓకే.. సూప‌ర్ అని పేర్కొంటూ.. క‌డ‌ప‌లో ఏకంగా వైసీపీని మ‌ట్టి క‌రిపించేందుకు ప్లాన్‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే కేంద్రం నిర్మించాల్సిన క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను తానే నిర్మిస్తానంటూ.. ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు శంకు స్థాప‌న చేశారు. దీనికి ముందు.. సీఎం ర‌మేష్‌తో (అప్ప‌టి టీడీపీ నేత‌) దీక్ష చేయించారు. అయితే.. ఇంత చేసినా.. టీడీపీ గ్రాఫ్ పెర‌గ‌లేదు. 2019 ఎన్నిక‌ల్లో సీమ‌లో ప‌డిన ప్ర‌యాస.. కేవ‌లం మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మై.. టీడీపీ కేవ‌లం మూడు చోట్ల మాత్ర‌మే విజ‌యం ద‌క్కించుకుంది. ఈ ప‌రిణామం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

ఒక్క క‌డ‌ప అనేకాదు.. అనంత‌పురం, క‌ర్నూలు.. చిత్తూరుల్లోనూ.. టీడీపీలో స‌ఖ్య‌త లేమి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అనంత‌పురం లో జేసీ వ‌ర్గం త‌న‌దారి వేర‌యా! అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. గ‌త మార్చిలో జ‌రిగిన స్థానికంలో జేసీ ప్ర‌భాక‌ర్ తాడిప‌త్రి మునిసిపాలిటీని ద‌క్కించుకున్నారు. దీనిని ఆయ‌న టీడీపీ ఖాతాలో వేయ‌కుండా.. కేవ‌లం.. త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్‌..కు తోడు.. ఏపీ సీఎం జ‌గ‌న్ స‌హ‌కారంతోనే విజ‌యం ద‌క్కించుకున్నాన‌ని.. బాహాటంగానే ప్ర‌క‌టించారు. ఇక‌, కాల్వ శ్రీనివాసులు.. ప‌రిటాల సునీత‌.. ఇక్క‌డ ఎవ‌రి రాజ‌కీయం వారిదే. క‌ర్నూలులో భూమా అఖిల ప్రియ వ‌ర్గానికి అడుగడుగునా చెక్ పెడుతోంది. అదేస‌మ‌యంలో కేఈ కుటుంబంలో అరుపుల మెరుపులు.. స‌వాళ్ల‌.. విసుర్లు త‌ప్ప‌.. క్షేత్ర‌స్థాయిలో ఇప్ప‌టి వ‌ర‌కు జెండా మోస్తున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

మ‌రోవైపు.. కోట్ల కుటుంబం రాజ‌కీయం ఎటు దారితీస్తుందో ఎవ‌రూ చెప్ప‌లేక పోతున్నారు. మ‌న‌సు ఒక‌చోట‌.. మ‌నుషులు మ‌రో చోట అన్న‌విధంగా కోట్ల కుటుంబం రాజ‌కీయాలు సాగుతున్నాయ‌నిఅంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, టీజీవెంక‌టేష్‌.. ఒక పార్టీలో త‌న త‌న‌యుడు టీడీపీలో ఉంటూ.. ద్వంద్వం రాజ‌కీయాలు చేస్తుండ‌డంపై ప్ర‌జ‌లు సైతం ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇక‌, చిత్తూరు విష‌యానికి వ‌స్తే.. ఎవ‌రికి వారే య‌మునా తీరే.. అన్న‌ట్టు వ్యవ‌హ‌రిస్తున్నారు. ఒక్క ప‌ల‌మ‌నేరులో మాజీ మంత్రి అమ‌ర్నాథ్‌రెడ్డి దూకుడు క‌నిపిస్తోంది త‌ప్ప‌.. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డా దూకుడు క‌నిపించ‌డం లేదు. ఇక‌, మాజీ ఎంపీ శివ‌ప్ర‌సాద్ అల్లుడు పంత‌గాని న‌ర‌సింహ‌ప్ర‌సాద్‌.. దూకుడు క‌నిపిస్తున్నా.. ఆయ‌న‌కు స‌రైన నియోజ‌క‌వ‌ర్గం లేకుండా పోయింది.

ఇక‌, గ‌త 2019, ఇటీవ‌ల జ‌రిగిన తిరుప‌తి పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ప‌న‌బాక ల‌క్ష్మి గురించి ఎంత చెప్పుకొన్నా త‌క్కువే. ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీకి అండ‌గా ఉంటాన‌ని ఆమె చెబుతున్నారు. ఎన్నిక‌ల్లో ఫ‌లితం వ‌చ్చాక‌.. మ‌ళ్లీ గ‌ప్‌చుప్ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో పార్టీ బ‌ల‌హీన‌ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు.. చంద్ర‌బాబుకు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనే చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయినా.. ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేవారు ఒక్క‌రంటే ఒక్క‌రూ క‌నిపించ‌డం లేదు. ఇలా.. మొత్తంగా చూస్తే.. టీడీపీ ప‌రిస్థితి అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెన‌క్కి అన్న చందంగా మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.