Begin typing your search above and press return to search.

పోలీసుల చేతుల్లో ‘సీతానగరం’ కేసు అత్యాచారం నిందితుడు !

By:  Tupaki Desk   |   6 Aug 2021 9:34 AM GMT
పోలీసుల చేతుల్లో ‘సీతానగరం’ కేసు అత్యాచారం నిందితుడు !
X
సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా సీతానగరం అత్యాచారం కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లాలో ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిందితుడిని గుంటూరు అర్బన్‌ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నట్టు సమాచారం. నిందితుడు షేర్‌ కృష్ణానా, వెంకటరెడ్డా అనేది తెలియాల్సి ఉంది. ఒంగోలులో తిష్టవేసిన పోలీసులు 30 రోజుల పాటు వివిధ వేషధారణలతో యాచకుల దగ్గర్నుంచి, హిజ్రాలను, సమోసాలు అమ్ముకునే వారిని, రైల్వే ట్రాక్‌ ల పక్కన చెత్త ఏరుకునే వారిని విచారిస్తూ ఎట్టకేలకు ఒంగోలు ఫ్లై ఓవర్‌ కింద సేదదీరుతున్న నిందితుడిని పట్టుకున్నారు.

రెండో నిందితుడు కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టు సమాచారం రావడంతో గుంటూరు అర్బన్‌ నుంచి వెళ్లిన పలు బృందాలు ఒంగోలు రైల్వే ట్రాక్‌లు, ఇతర ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాయి. ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టు సమాచారం రావడంతో గుంటూరు అర్బన్‌ పోలీస్ స్టేషన్‌ నుంచి వెళ్లిన పలు బృందాలు.. ఒంగోలు రైల్వే ట్రాక్‌లు, చెన్నై రైల్వే మార్గంలోని ప్రధాన పట్టణాల్లో, గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.

తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో పుష్కరఘాట్ వద్ద జూన్ 19వ తేదీన రాత్రి వేళ యువతిపై దుండుగుల అత్యాచారానికి పాల్పడ్డారు. నదీతీరాన సేద తీరుతున్న ప్రేమ జంటపై దాడి చేసిన దుండగులు, ప్రియుడిని తాళ్లతో కట్టేశారు. ఆ తరువాత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో వారు అక్కడి నుంచి ఉడాయించారు. కాగా, మరుసటి రోజు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. బాధిత యువతికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. స్వయంగా హోంమంత్రి సుచరిత.. బాధిత యువతిని కలిసి రూ. 5 లక్షల పరిహారం అందజేశారు.