Begin typing your search above and press return to search.

సెహ్వాగ్​ నీ జోరుకు సలాం.. లేటు వయసులోనూ అదే స్పీడు !

By:  Tupaki Desk   |   7 March 2021 5:36 AM GMT
సెహ్వాగ్​ నీ జోరుకు సలాం.. లేటు వయసులోనూ అదే స్పీడు !
X
సెహ్వాగ్​ క్రీజులో ఉన్నాడంటే స్కోరు బోర్డు పరుగులు పెట్టేది. రెట్టించిన ఉత్సాహంతో ఫోర్లు, సిక్సులు కొడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. సెహ్వాగ్​ క్రీజులో నిలబడితే వార్​ వన్​సైడే.. అవుతలి టీం ఆశలు వదులుకోవాల్సిందే. భారత మాజీ ఓపెనర్​, డాషింగ్​ బ్యాట్స్​మన్​ సెహ్వాగ్​కు ఇప్పుడు మరోసారి ఆడే అవకాశం వచ్చింది. దీంతో మళ్లీ తన పాత స్పీడును, జోరును రుచిచూపించాడు. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత లెజెండ్స్ జట్టు.. బంగ్లాదేశ్​తో తలపడింది.

ఈ మ్యాచ్​లో సెహ్వాగ్​ సత్తా చాటాడు. కేవలం 35 బంతుల్లో 80 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 5 సిక్సులతో చెలరేగాడు. సెహ్వాగ్​ బ్యాటింగ్​ స్టైల్​ చూసిన ప్రేక్షకులు పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ మ్యాచ్​లో యువరాజ్​ కూడా ఆకట్టుకున్నాడు.

సెహ్వాగ్​తో పాటు సచిన్‌ టెండూల్కర్‌ (33 నాటౌట్‌; 5 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భారత లెజెండ్స్‌ జట్టు బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌.. ఆర్ వినయ్‌కుమార్‌ (2/25), ప్రజ్ఞాన్ ఓజా (2/12), యువరాజ్‌ సింగ్ (2/15) ధాటికి 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ నజీముద్దీన్‌ (40) టాప్‌ స్కోరర్‌.

అనంతరం బ్యాటింగ్​ చేపట్టిన భారత్‌ లెజెండ్స్‌ జట్టు 61 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. తొలి ఓవర్లోనే సెహ్వాగ్ మూడు ఫోర్లు, సిక్స్‌ కొట్టాడు. సెహ్వాగ్​ 20 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ చేశాడు. దీంతో భారతజట్టు 10.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది.సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, నోయెల్‌ డేవిడ్‌, మునాఫ్ పటేల్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, మన్‌ప్రీత్‌ గోనీ, యూసుఫ్‌ పఠాన్‌, నమన్‌ ఓజా, ఎస్‌ బద్రీనాథ్‌, వినయ్‌ కుమార్‌ ఇండియా లెజెండ్స్​ జట్టు తరఫున ఆడారు.