Begin typing your search above and press return to search.

రుణం తీర్చుకుంటున్న బీజేపీ

By:  Tupaki Desk   |   9 April 2015 12:03 PM GMT
రుణం తీర్చుకుంటున్న బీజేపీ
X
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు ఒడ్డిన విషయం తెలిసిందే. అన్నింటికంటే ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రభావవంతంగా ఉండటమే కాకుండా నిర్ణయాలను ప్రభావితం చేయగలుగుతున్నసోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ మీడియాను చాలా బాగా ఉపయోగించుకుంది. వాటి ఆధారంగానే అధికారంలోకి రాగలిగామని పలు సందర్భాల్లో మోడీ ప్రకటించారు కూడా. ఇపుడు బీజేపీ ఆ రుణం తీసుకునే పనిలో పడింది.

విశాఖపట్టణంలో జరిగిన కామన్వెల్త్‌ పార్లమెంటేరియన్‌ అసోసియేషన్‌ సమావేశంలో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఈ మేరకు ఆన్‌లైన్‌ మీడియాకు కితాబు ఇచ్చారు.

గతంలో పత్రికలు, కొద్దికాలం క్రితం వరకు టీవీలు నిర్ణయాలను ప్రభావితం చేసేవిగా ఉండగా ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ మీడియా ఆ కోవలోకి చేరిందన్నారు. టెక్నాలజీ అందుబాటులోకి రావడం, యువత పెద్ద ఎత్తున సాంకేతికతను ఉపయోగించడం వల్ల డిజిటల్‌ మీడియా వాడకం పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ మీడియాను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా స్పీకర్‌ మీడియాకు పలు అంశాల్లో మార్గదర్శకం కూడా చేశారు. ప్రసార మాధ్యమాలు స్వీయ నియంత్రణ పాటించడమే కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరారు. భావ ప్రకటన స్వేచ్చను దుర్వినియోగం చేయవద్దని, ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా మీడియా ముందుకువెళ్లాలని కోరారు.

మొత్తంగా బీజేపీకి చెందిన ఎంపీ అయిన సుమిత్రా మహాజన్‌ ఆన్‌లైన్‌ మీడియా ప్రాధామ్యాన్ని గుర్తించడం సంతోషకరమని హర్షం వ్యక్తం అవుతోంది.