Begin typing your search above and press return to search.

ప్రాణాల మీద‌కు తెచ్చిన సెల్ఫీ పిచ్చ‌!

By:  Tupaki Desk   |   24 Jan 2018 10:02 AM GMT
ప్రాణాల మీద‌కు తెచ్చిన సెల్ఫీ పిచ్చ‌!
X
చేతిలో స్మార్ట్ ఫోన్....చౌక‌ధ‌ర‌కే స‌రిప‌డినంత మొబైల్ డేటా.....సోష‌ల్ మీడియాలో త‌మ ప‌ర‌ప‌తిని చాటుకోవాల‌నే త‌ప‌న‌.....నేటి యువ‌త‌ను పెడ‌దారి ప‌ట్టేలా చేస్తోంది. పేస్ బుక్ లో, వాట్సాప్ లో లైక్ ల కోసం, షేర్ ల కోసం....ప్ర‌మాద‌క‌ర ప్రాంతాల‌లో సెల్ఫీలు దిగేందుకు యువ‌త ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌డం లేదు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌దేశాల్లో సెల్ఫీలు తీసుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో కొంద‌రు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌ల గురించి మ‌నం నిత్యం వింటూనే ఉన్నాం. ఇదే త‌ర‌హాలో హైద‌రాబాద్ లో సెల్ఫీల‌పై మోజుతో ఓ యువ‌కుడు ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు. న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న భ‌ర‌త్ న‌గ‌ర్ రైల్వే ట్రాక్ పై జ‌రిగిన ఈ ఘ‌ట‌న న‌గ‌ర‌వ్యాప్తంగా క‌ల‌కలం రేపింది. అత‌డి సెల్ఫీ విన్యాసాలు రికార్డ‌వ‌డంతో ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

హైద‌రాబాద్ కు చెందిన ఓ యువ‌కుడికి సెల్ఫీలంటే మ‌హా స‌ర‌దా. వెరైటీ గా రైలు పట్టాల ద‌గ్గ‌ర నిల్చుని సెల్ఫీ దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేద్దామ‌ని భావించాడు. ఈ క్ర‌మంలో భ‌ర‌త్ న‌గ‌ర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలోని రైల్వే ట్రాక్ వద్ద‌కు చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో వెనుక నుంచి వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. ఈ హ‌ఠాత్ప‌రిణామానికి కంగుతిన్న ఆ యువ‌కుడు రైలు వేగానికి ప‌క్క‌కు ఎగిరిపడ్డాడు. త‌ల‌కు తీవ్రగాయాలు కావ‌డంతో అత‌డు లింగంపల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని రైల్వే ఏస్పీ అశోక్ తెలిపారు. అత‌డి చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయని, ప్రాణాపాయమేమీ లేదని చెప్పారు. సెల్ఫీ వీడియో తీసుకోవ‌డం, ఈ క్ర‌మంలో అత‌డిని రైలు వచ్చి ఢీకొన‌డం వంటి దృశ్యాలు రికార్డయ్యాయి. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే, ఎన్ని ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా యువ‌తలో సెల్ఫీల‌పై మోజు త‌గ్గ‌డం లేదు. క్ష‌ణికానందం కోసం, మిత్రుల అభినంద‌న‌ల కోసం, గ‌ర్ల్ ఫ్రెండ్ ను ఇంప్రెస్ చేయ‌డం కోసం....ఇటువంటి అఘాయిత్యాల‌కు పాల్ప‌డి క‌న్న‌వాళ్ల‌కు క‌డుపుకోత మిగులుస్తున్నారు. ఏదైనా ప‌రిధి దాటితే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ఓ స్థాయి వ‌ర‌కు సెల్ఫీలు తీసుకోవ‌డం....అవి తీసుకునేట‌పుడు త‌గు జాగ్ర‌త్త‌లు వ‌హించ‌డం వంటివి చేయ‌డం ద్వారా ఇటువంటి ప్ర‌మాదాల‌ను నివారించవచ్చని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.