Begin typing your search above and press return to search.

ఏపీలో బార్ లైసెన్సులు.. ఈ లెక్క తెలిస్తే నోట మాట రాదంతే

By:  Tupaki Desk   |   2 Aug 2022 4:43 AM GMT
ఏపీలో బార్ లైసెన్సులు.. ఈ లెక్క తెలిస్తే నోట మాట రాదంతే
X
అధికారం చేతికి రాక ముందు ఒకలా.. వచ్చిన తర్వాత మరోలా అన్న విషయంపై అధినేతల నోటి నుంచి వచ్చే మాటలకు చేతలకు మధ్య తేడా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలోని జగన్ సర్కారు తాజాగా వేలం వేసిన బార్ లైసెన్సుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాము పవర్లోకి వస్తే.. దశల వారీగా మద్య నిషేధమంటూ గొప్పలు చెప్పిన సీఎం జగన్.. ఇప్పుడు మాత్రం అందుకు మొతభిన్నంగా బార్ లు భారీ ఎత్తున ఏర్పాటు చేసేలా వేలం ప్రక్రియను పూర్తి చేశారు.

2019లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 840 బార్లు ఉంటే.. తాజాగా లైసెన్సుల జారీకి వేలం నిర్వహించిన బార్ల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 838.అంటే.. బాబు హయాంలో ఉన్న బార్లకు కేవలం రెండు మాత్రమే తక్కువగా లైసెన్సులు జారీ చేశారు.

వాటిల్లోనూ అత్యధికంగా వైసీపీకి చెందిన వారికే లైసెన్సులు లభించినట్లుగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సాధారణంగా బార్ లైసెన్సులు ఏడాదికి ఏడాదికి చొప్పున ఇచ్చేలా చేస్తుంటారు. అయితే.. జగన్ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు.

తాజాగా నిర్వహించిన బార్ లైసెన్సులు ఏకంగా మూడేళ్ల పాటు నిర్వహించుకోవటానికి వీలుగా వేలాన్ని ఏర్పాటు చేయటం విశేషంగా చెప్పాలి. నిజానికి జగన్ సర్కారు గడువు.. 2024 జూన్ వరకే. అయితే.. జగన్ సర్కారు మాత్రం తమ కాల పరిమితికి మించి మరీ లైసెన్సులు జారీ చేయటం ఆసక్తికరంగా మారింది. తాజాగా జారీ చేసిన లైసెన్సులు 2025 ఆగస్టు 31 వరకు నిర్వహించుకునేలా ఆదేశాలు ఇస్తున్నారు.

అంతేకాదు.. తాజాగా బార్ లైసెన్సులు పొందిన వారు జగన్ సర్కారుకు కాల పరిమితి పూర్తి అయిన ఏడాది వరకు కూడా తమ బార్ లను నిర్విఘ్నంగా నడుపుకునేందుకు వీలుగా ఇప్పుడు పర్మిషన్ ఇస్తున్నారని చెప్పాలి. మొత్తానికి తమ ప్రభుత్వ హయాం పూర్తి అయిన తర్వాత తన ప్రభుత్వంలో లైసెన్సులు చేజిక్కించుకునే వారే కొనసాగేలా వేసిన స్కెచ్ అదిరిందన్న మాట వినిపిస్తోంది.

గడిచిన రెండు రోజులుగా 838 బార్లకు వేలం వేస్తే.. 815 బార్లను ఎవరికి ఇవ్వాలన్నది ఫైనల్ చేశారు. మిగిలిన వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని చెబుతున్నారు. తమ ప్రభుత్వ కాల పరిమితి ముగిసిన తర్వాత బార్లకు లైసెన్సులు జారీ చేసిన వైనం తెలుగు తమ్ముళ్లకు దిమ్మ తిరిగే షాక్ గా అభివర్ణిస్తున్నారు.