Begin typing your search above and press return to search.

యూఎన్ రిపోర్ట్‌: మ‌న పెళ్లిళ్ల‌లో ఆ మార్పు వ‌చ్చింద‌ట‌!

By:  Tupaki Desk   |   27 Jun 2019 4:59 AM GMT
యూఎన్ రిపోర్ట్‌: మ‌న పెళ్లిళ్ల‌లో ఆ మార్పు వ‌చ్చింద‌ట‌!
X
వివిధ అంశాల మీద నివేదిక‌ల్ని విడుద‌ల చేసే ఐక్య‌రాజ్య‌సమితి తాజాగా వివిధ దేశాల్లో జ‌రుగుతున్న పెళ్లిళ్ల మీదా.. ఆ సంద‌ర్భంగా చోటు చేసుకున్న మార్పుల మీద ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డిస్తూ ఒక నివేదిక‌ను విడుద‌ల చేసింది. మొత్తం 89 దేశాల్లోని స‌మాచారాన్ని విశ్లేషించి త‌యారు చేసిన ఈ రిపోర్ట్ సారాంశం మారుతున్న ప్ర‌పంచంలో కుటుంబాలు.. మ‌హిళ‌ల ప్ర‌గ‌తి అనే అంశం మీద ఒక భారీ నివేదిక‌ను సిద్ధం చేశారు.

ఇందులో మ‌న దేశంలోని అమ్మాయిలు పెళ్లి విష‌యంలో చోటుచేసుకున్న కొత్త మార్పును ప్ర‌స్తావించారు. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లిలోనూ ఇప్పుడు కొత్త విధానం వ‌చ్చింద‌ని.. పెళ్లిలో జీవిత భాగ‌స్వామిని ఎంపిక చేసుకునే విష‌యంలో అమ్మాయి ఇష్టానికే వ‌దిలివేస్తున్న విష‌యాన్ని ప్ర‌స్తావించింది. చూసేందుకు అరెంజ్డ్ లా క‌నిపిస్తున్నా.. అమ్మాయి నిర్ణ‌యానికే పెద్ద‌పీట వేయ‌టం దీని ప్ర‌త్యేకత‌గా చెబుతున్నారు.

ఈ త‌ర‌హా పెళ్లిళ్ల‌ను సెమీ అరెంజ్డ్ గా అభివ‌ర్ణించారు. గ్రామీణ భార‌తంతో పోలిస్తే ప‌ట్ట‌ణ ప్రాంతంలో ఈ త‌ర‌హా పెళ్లిళ్లు చాలా ఎక్కువ‌గా క‌నిపిస్తున్న‌ట్లు తాజా నివేదిక స్ప‌ష్టం చేసింది. త‌గిన సంబంధాలు చూస్తున్న త‌ల్లిదండ్రులు.. ఎవ‌రిని పెళ్లి చేసుకోవాలి? అబ్బాయిల ఎంపిక‌లో అమ్మాయిల‌కు పూర్తి స్వేచ్ఛ‌ను ఇస్తున్న‌ట్లుగా స్ప‌ష్టం చేసింది. ఒక‌ప్పుడు పెళ్లి డిసైడ్ చేసిన త‌ర్వాత.. తాను చేసుకునే భాగ‌స్వామిని చూసే ధోర‌ణికి భిన్నంగా తాజా భార‌తంలో ఉన్న‌ట్లుగా స‌ద‌రు నివేదిక స్ప‌ష్టం చేసింది.

పెద్ద‌లు కుద‌ర్చిన పెళ్లి చేసుకున్న వారితో పోలిస్తే సెమీ అరెంజ్డ్ పెళ్లి చేసుకున్న వారు సుఖంగా.. సంతోషంగా ఉంటార‌ని పేర్కొంది. అంతేకాదు.. ఈ త‌ర‌హా పెళ్లిలో ఖ‌ర్చుల పైనా.. పిల్ల‌ల్ని క‌నాలా? వ‌ద్దా? ఎంత‌మందిని క‌నాలి? లాంటి అంశాల్లో స్వేచ్ఛ ఎక్కువ‌గా ఉంటుంద‌ని పేర్కొంది. ఎవ‌రి తోడు లేకుండా స్నేహితులు.. బంధువుల‌ను చూడ‌టానికి వెళ్లే స్వేచ్ఛ రెండు రెట్లు ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పింది. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లిళ్ల‌లో అమ్మాయిలు గృహ‌హింస ముప్పు త‌క్కువ‌గా చెబుతున్నారు. మొత్తంగా దేశంలో అమ్మాయిల‌కు పెళ్లి విష‌యంలో పెరుగుతున్న స్వేచ్ఛ‌ను తాజా నివేదిక క‌ళ్ల‌కు కట్టిన‌ట్లుగా చెబుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.