Begin typing your search above and press return to search.

రాహుల్ పై ఒబామా వ్యాఖ్యలపై సేన ఎంతలా రియాక్ట్ అయ్యిందంటే?

By:  Tupaki Desk   |   15 Nov 2020 2:00 PM GMT
రాహుల్ పై ఒబామా వ్యాఖ్యలపై సేన ఎంతలా రియాక్ట్ అయ్యిందంటే?
X
ఎదుటి వ్యక్తి ఎవరైతే మాత్రం.. మనోడ్ని అన్నప్పుడు.. ఆ మాటలతో డ్యామేజ్ అవుతున్నప్పుడు మౌనంగా ఉండటం ఏమిటి? ఉతికి ఆరేయాలి కదా? వినయానికి.. విధేయతకు అంతకు మించిన నిదర్శనం ఏముంటుంది? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గాంధీ ఫ్యామిలీపై మాట అంటే చాలు.. కాంగ్రెస్ నేతలు చెలరేగిపోయేవారు. అలాంటి వారంతా ఇప్పుడు మౌనంగా ఉండటం గమనార్హం. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన పుస్తకంలో రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉన్నాయని చెప్పక తప్పుదు.

అవగాహన తక్కువ.. ఆసక్తి తక్కువ అంటూ రాహుల్ కు ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేసిన వైనంపై కాంగ్రెస్ నేతలు కుప్పలుతిప్పలుగా విరుచుకుపడి.. తమ యువరాజు సామర్థ్యం ఏమిటో.. సత్తా ఏమిటో చాటాలి కదా? అందుకు భిన్నంగా వారు ఏదో అన్నామంటే అన్నామన్నట్లుగా ఉండిపోయారు. అందుకు భిన్నంగా కాంగ్రెస్ కు కొత్త మిత్రుడు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఉద్దవ్ ఠాక్రే ప్రాతినిధ్యం వహించే శివసేన మాత్రం అస్సలు ఊరుకోలేదు. రాహుల్ మా మిత్రుడు. ఆయన్నే అంత మాట అనేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు.

టీచర్ కంట పడటానికి ప్రయత్నించే విద్యార్థిలా రాహుల్ ఆరాటమే తప్పించి.. ఒక విషయాన్ని లోతుగా తెలుసుకోవాలన్న తపన లేదన్న ఒబామా వ్యాఖ్యలపై సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు భారత్ గురించి ఒబామాకు ఏం తెలుసని ప్రశ్నించటమే కాదు.. భారత రాజకీయ నేతల గురించి ఒక విదేశీ నేత అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం సరికాదన్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతపై ఒబామా వ్యాఖ్యల తర్వాత దేశంలో రాజకీయ ప్రతిస్పందన అసహ్యంగా ఉంది. ట్రంప్ పిచ్చివాడు అని మేం అనం. ఈ దేశం గురించి ఒబామాకు ఏం తెలుసు? అంటూ ఫైర్ అయ్యారు.

సేన స్పందనతో పోలిస్తే కాంగ్రెస్ నేతల రియాక్షన్ ప్రభావవంతంగా లేదని చెప్పాలి. ఎనిమిది.. పదేళ్ల క్రితం భారత్ కు వచ్చిన ఒబామాను రాహుల్ కలిశారని..ఒకట్రెండుసార్లు కలుసుకున్న ఒక వ్యక్తి గురించి అంచనా వేయటం కష్టమని కాంగ్రెస్ సీనియర్ నేత తారీఖ్ అన్వర్ వ్యాఖ్యానించారు. అప్పటికి.. ఇప్పటికి రాహుల్ వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చిందన్న ఆయన.. ఎంతో పరిణితి సాధించారన్నారు. ఇదంతా చూసినప్పుడు.. శివసేన లాంటి మిత్రుడు ఏ రాజకీయ పార్టీకైనా ఉండటం అవసరమనిపించక మానదు.