Begin typing your search above and press return to search.

మునుగోడులో ఓటర్లకు బంగారం పంపకాలు.. తాజా ట్రెండ్‌ ఇదే!

By:  Tupaki Desk   |   1 Nov 2022 9:33 AM GMT
మునుగోడులో ఓటర్లకు బంగారం పంపకాలు.. తాజా ట్రెండ్‌ ఇదే!
X
దేశస్థాయిలో ఆసక్తి రేపుతున్న ఉప ఎన్నిక.. తెలంగాణలోని మునుగోడు. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉంటూ ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అధికార టీఆర్‌ఎస్‌ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున పార్టీ పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు.

కాగా కొద్దిరోజుల క్రితం నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగాయన్న వార్త హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్ల ఇవ్వచూపారన్న వార్త కలకలం సృష్టించింది.

ఈ నేపథ్యంలో మునుగోడులో ఎవరు గెలుస్తారనే అంశం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలో ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌లు సైతం అంతేస్థాయిలో జరుగుతున్నాయి.

నవంబర్‌ 3న జరగనున్న మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల తూటాలు, తీవ్ర విమర్శలతో ప్రజలు ఆ రెండు పార్టీలను వదిలేసి కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

తెలంగాణలోనే కాకుండా దేశంలోనే ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా దీన్ని భావిస్తున్నారు. దీంతో పందేలు సైతం అంతే స్థాయిలో నడుస్తున్నాయి.

ఓటర్లు, నేతలను ప్రలోభపెట్టేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు వెచ్చిస్తున్నాయని చెబుతుండగా.. ఇప్పటికి రూ.1000 కోట్లకు పైగా బెట్టింగ్‌లు జరిగినట్లు తెలిసింది.

తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే మునుగోడు ఉప ఎన్నికపై భారీ స్థాయిలో బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని చూస్తున్న బీజేపీ ఏకంగా ఓటర్లకు బంగారం కాయిన్‌లు పంపిణీ చేస్తోందని తెలుస్తోంది.

ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీ భారీ ఎత్తున ఓటర్లకు డబ్బు, మద్యం, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, దుస్తులు పంపిణీ చేశాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు బీజేపీ ఏకంగా ప్రతి ఇంటికీ తులం బంగారం కాయిన్‌ పంపిణీ చేస్తోందని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఒక చిన్న ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో చుట్టబడిన బంగారు నాణెం ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోతో విస్తృతంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఏకంగా ప్రతి కుటుంబానికి తులం బంగారం ఇస్తున్నారంటూ మునుగోడు ఉప ఎన్నిక ఎంత ఖరీదుగా మారిందో చెప్పవచ్చని అంటున్నారు.

గతంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా పరిగణించారు. ఈటెల రాజేందర్‌ను ఓడించడానికి ఇక్కడ టీఆర్‌ఎస్‌ వందల కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసిందనే విమర్శలు తలెత్తాయి. ఇప్పడు మునుగోడు.. హుజురాబాద్‌ను మించిపోయి రికార్డు సృష్టిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.