Begin typing your search above and press return to search.

రాజకీయాల నుంచి క‌నుమ‌రుగువుతోన్న సీనియ‌ర్ న‌టుడు!

By:  Tupaki Desk   |   5 Sep 2021 10:30 AM GMT
రాజకీయాల నుంచి క‌నుమ‌రుగువుతోన్న సీనియ‌ర్ న‌టుడు!
X
ప‌రిస్థితులు బాగున్న‌పుడు రాజ‌కీయ నాయ‌కులు ఏం చేసినా సాగుతుంది. కానీ పార్టీనే దీనావ‌స్థ‌లో ఉన్న‌పుడు ఇక నాయ‌కుల సంగ‌తి అంత‌కంటే దారుణంగా ఉంటుంది. ఆ స‌మయంలో వ‌య‌సు మీద ప‌డ్డ నాయ‌కులైతే నెమ్మ‌దిగా పార్టీ నుంచి జారుకోవ‌డం త‌ప్ప ఇంకేం చేస్తారు? ఇప్పుడు సీనియ‌ర్ న‌టుడు వ్యాపార‌వేత్త రాజ‌కీయ నాయ‌కుడు ముర‌ళీమోహ‌న్ కూడా అదే బాటులో సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. మునిగిపోయే నావ‌లా క‌నిపిస్తున్న తెలుగు దేశం పార్టీ నుంచి నెమ్మ‌దిగా త‌ప్పుకుంటున్నార‌ని స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ధాటికి ఘోర ప‌రాజ‌యం పాలైన టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తిరిగి పుంజుకుని అధికారం ద‌క్కించుకునే అవ‌కాశాలు లేవ‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆ పార్టీకి కొంత‌మంది నాయ‌కులు గుడ్‌బై చెప్పి ఇత‌ర పార్టీల్లో చేరిపోతున్నారు. మ‌రికొంత మంది సీనియ‌ర్ నాయ‌కులు చ‌డీచ‌ప్పుడు లేకుండా క‌నుమ‌రుగైపోతున్నారు. ఇప్పుడు ముర‌ళీ మోహ‌న్ రెండో కోవ‌లోకే వ‌స్తారు. గ‌తంలో ఓ స్థాయిలో పార్టీలో చ‌క్రం తిప్పిన ఆయ‌న కొద్దికాలంగా నిశ్శ‌బ్ధ‌మైపోయారు. ఇప్పుడు ఏకంగా టీడీపీకి దూరం జ‌రుగుతున్నారని తెలిసింది. ఇక త‌న‌కు రాజ‌కీయాలు వ‌ద్ద‌ని ఆయ‌న అనుకుంటున్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. మంచి వ్యాపార‌వేత్త అయిన ఆయ‌న లాభ‌న‌ష్టాలు చూసుకోనిది ఏ ప‌ని చేయ‌ర‌ని చెప్తుంటారు. దీంతో ఇప్పుడు ఆయ‌న‌కు కానీ ఆయ‌న కుటుంబానికి కానీ టీడీపీ వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేద‌ని భావించిన ఆయ‌న పార్టీకి దూర‌మ‌వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

టీడీపీ త‌ర‌పున 2009 లోక‌స‌భ ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి నుంచి పోటీ చేసిన ఆయ‌న అప్ప‌టి కాంగ్రెస్ నేత ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఇక రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన 2014 ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి నుంచి ఎంపీగా గెలిచారు. అప్పుడు తెలుగు దేశం పార్టీలో క్రియాశీల‌క పాత్ర పోషించారు. కానీ 2019 ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి త‌ర్వాత ఆయ‌న సైలెంట‌య్యారు. ఇక ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 81 ఏళ్లు. ఈ వ‌య‌సులో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఆక్టివ్‌గా ఉండ‌డం ఇబ్బందే. పైగా ఈ స‌మ‌యంలో అధికారంలో ఉన్న జ‌గ‌న్ టార్గెట్‌గా వ్యాఖ్య‌లు చేస్తే ఆయ‌న ప‌రిస్థితి ఎలా మారుతుందో ముర‌ళీమోహ‌న్‌కు బాగా తెలుసు. అందుకే రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌డ‌మే మేల‌నుకున్న ఆయ‌న రాజ‌మండ్రిలో మ‌కాం ఎత్తేసి పూర్తిగా హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

ఈ వ‌య‌సులో ముర‌ళీమోహ‌న్‌కు చంద్ర‌బాబు కూడా మ‌ళ్లీ అవ‌కాశం ఇచ్చే ఆస్కార‌మే లేదు. దీంతో పాటు త‌న వార‌సుల‌ను బాబు గుర్తించ‌డం లేద‌నే కార‌ణంతో ముర‌ళీ మోహ‌న్ దూరంగా ఉంటున్నార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయ‌న లాగే పార్టీలో చాలా మంది సీనియ‌ర్ నేత‌ల ప‌రిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్లంతా సైలెంట్‌గానే ప‌క్క‌కు త‌ప్పుకుంటున్నారు.