Begin typing your search above and press return to search.

ఏపీ మూడు ముక్కలయ్యేందుకు సిద్ధంగా ఉంది: సీనియర్‌ ఐపీఎస్‌ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   6 Jan 2023 5:41 AM GMT
ఏపీ మూడు ముక్కలయ్యేందుకు సిద్ధంగా ఉంది: సీనియర్‌ ఐపీఎస్‌ సంచలన వ్యాఖ్యలు!
X
ఆంధ్రప్రదేశ్‌ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో మూడు ముక్కలు అయ్యేందుకు సిద్ధంగా ఉందని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్బులో సీనియర్‌ జర్నలిస్టు ఆలపాటి సురేష్‌ కుమార్‌ రాసిన 'రాజ్యం... మతం.. కోర్టులు.. హక్కులు..!' పుస్తకాన్ని ఏబీ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 'రాజ్యం... మతం.. కోర్టులు.. హక్కులు..!' పుస్తకం హేతుబద్ధమైన తాత్విక ఆలోచనలు అందిస్తోందని తెలిపారు. రచయిత సురేష్‌ కుమార్‌ ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్రం మూడు ముక్కలు అయ్యేందుకు సిద్ధంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రజలకు సెక్యులరిజం అనే రక్షణను తొలగించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.

శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాల తీరు ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా అనుమతి తీసుకోవాలేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంటెలిజెన్స్‌ అధిపతిగా చక్రం తిప్పారు.. ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. అయితే ఇదంతా గతం. 2019 శాసనసభ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఏబీకి కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం వెనుక ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర కీలకమని జగన్‌ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది.

అంతేకాకుండా తమ ఫోన్లను ట్యాప్‌ చేయడానికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇజ్రాయెల్‌ నుంచి పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఈ పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు వెనుక చక్రం తిప్పింది కూడా ఏబీ వెంకటేశ్వరరావేనని విమర్శలు గుప్పిస్తోంది. ఏబీ కుమారుడికి చెందిన కంపెనీయే పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలులో కీలక పాత్ర పోషించిందని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని జగన్‌ ప్రభుత్వం చెబుతోంది.

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఏబీ వెంకటేశ్వరరావును లక్ష్యంగా చేసుకుంది. అందులోనూ ఏబీ కూడా కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. దీంతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏబీ ఆయన చెప్పినట్టు చేశారని వైఎస్సార్‌సీపీ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగా 2020 ఫిబ్రవరి 8న ఏబీని విధుల్లోంచి తొలగించింది. అంతేకాకుండా సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి మీడియాతో మాట్లాడిన ఆయనను ఎందుకు పదవి నుంచి తొలగించకూడదో చెప్పాలంటూ షోకాజు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఏబీ సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి తనకు అనుకూలంగా ఉత్తర్వులు పొందగలిగారు. అయితే జగన్‌ ప్రభుత్వం రకరకాల కారణాలు చూపి ఆయనను సస్పెండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోమారు ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై జగన్‌ ప్రభుత్వం ఎలా స్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.