Begin typing your search above and press return to search.

ఆ జ‌ర్న‌లిస్ట్ ను పాయింట్ బ్లాక్ లో చంపేశారు

By:  Tupaki Desk   |   6 Sep 2017 4:02 AM GMT
ఆ జ‌ర్న‌లిస్ట్ ను పాయింట్ బ్లాక్ లో చంపేశారు
X
దారుణం చోటు చేసుకుంది. మ‌హాన‌గ‌రంగా చెప్పే గార్డెన్ సిటీలో ఘోరం చోటు చేసుకుంది. హిందుత్వ రాజ‌కీయాల‌పై విమ‌ర్శ‌నాత్మ‌కంగా.. బీజేపీ మ‌త‌త‌త్వ రాజ‌కీయాల‌పై త‌ప్పు ప‌డుతూ విశ్లేష‌ణాత్మ‌క క‌థ‌నాలు రాసే జ‌ర్న‌లిస్ట్ గౌరీ లంకేశ్ (55) దారుణహ‌త్య‌కు గుర‌య్యారు. మంగ‌ళ‌వారం రాత్రి బెంగ‌ళూరులోని త‌న ఇంటి గేటు తీస్తుండ‌గా.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు బైక్ ల మీద వ‌చ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జ‌రిపారు.

బుల్లెట్లు ఆమె మెడ‌.. ఛాతీ భాగాల్లో దూసుకుపోవ‌టంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయారు. అనంత‌రం ఆమె మృత‌దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విక్టోరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గ‌తంలో ఆమెతో తాను మాట్లాడాన‌ని.. త‌న ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉన్న‌ట్లు ఆమె ఎప్పుడూ త‌న‌తో చెప్ప‌లేద‌ని క‌ర్ణాట‌క డీజీపీ ఆర్కే ద‌త్తా వెల్ల‌డించారు.

క‌న్న‌డ నాట పాత్రికేయాన్ని కొత్త పుంత‌లు తొక్కించిన ప్ర‌ముఖ పాత్రికేయుడు.. ర‌చ‌యిత‌.. క‌వి లంకేశ్ పెద్ద క‌మార్తే గౌరి. తండ్రి అడుగుజాడ‌ల్లో న‌డిచిన ఆమె గౌరీ లంకేశ్ ప‌త్రికె పేరుతో ఒక టాబ్లాయిడ్‌ను ప్ర‌చురిస్తున్నారు. బీజేపీ మ‌త రాజ‌కీయాల మీదా ఆమె విమ‌ర్శ‌నాత్మ‌క క‌థ‌నాలు ప్ర‌చురించేవారు.

అలా ఆమె రాసిన ఒక వ్యాసంపై ధార్వాడ్ ఎంపీ ప్ర‌హ్లాద్ జోషి (బీజేపీ).. మ‌రో నేత ఉమేశ్ దుషిలు వేర్వేరుగా ఆమెపై ప‌రువున‌ష్టం దావా వేశారు. వాటిని విచారించిన కోర్టు గ‌త ఏడాది న‌వంబ‌రులో ఆమెను దోషిగా నిర్దారించి ఆర్నెల్లు జైలుశిక్ష‌.. రూ.10వేల జ‌రిమానాను విధించారు. అయితే.. బెయిల్ ఇచ్చి హైకోర్టుకు అప్పీలు చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించారు.

గౌరీ దారుణహ‌త్య‌పై రాజ‌కీయ‌.. పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. క‌ర్ణాట‌క‌ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ .. సీపీఎం అగ్ర‌నేత సీతారం ఏచూరి త‌దిత‌రులు గౌరీ హ‌త్య‌ను తీవ్రంగా ఖండించారు. హంత‌కుల్ని వీలైనంత త్వ‌ర‌గా ప‌ట్టుకోవాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు. ఈ హ‌త్య నేప‌థ్యంలో హేతువాది న‌రేంద్ర ద‌భోల్క‌ర్ హ‌త్య‌కేసును ద‌ర్యాప్తు చేస్తున్న మ‌హారాష్ట్ర పోలీసుల‌ను కూడా క‌ర్ణాట‌క పోలీసులు సంప్ర‌దించాల‌ని.. దర్యాప్తు బృందాల‌కు చెప్పిన‌ట్లుగా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

గౌరీ లంకేశ్ దారుణ హ‌త్య‌పై ప్రెస్ క్ల‌బ్ ఆఫ్ ఇండియా ఒక ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఆమె హ‌త్య‌ను తీవ్రంగా ఖండించింది. ఆమెను బ‌లిగొన్న వారిని వెంట‌నే అదుపులోకి తీసుకోవాల‌ని.. చ‌ట్ట‌ప్ర‌కారం శిక్షించాల‌ని డిమాండ్ చేసింది. క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధాని అయిన బెంగ‌ళూరులో శాంతి భ‌ద్ర‌త‌లు ఎంత దారుణంగా ఉన్నాయో తాజా ఉదంతం స్ప‌ష్టం చేసింద‌ని విమ‌ర్శించింది.