Begin typing your search above and press return to search.

మ‌రో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌ ను చంపేశారు

By:  Tupaki Desk   |   24 Sep 2017 4:36 AM GMT
మ‌రో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌ ను చంపేశారు
X
దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌ముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హ‌త్య‌ను మ‌ర్చిపోక ముందే మ‌రో దారుణ హ‌త్య చోటు చేసుకుంది. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కేజే సింగ్‌.. ఆయ‌న త‌ల్లి గురుచ‌ర‌ణ్ కౌర్‌ల‌ను వారి నివాసంలో దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. కేజే సింగ్ వ‌య‌సు 64 సంవ‌త్స‌రాలు కాగా.. ఆయ‌న త‌ల్లి వ‌య‌సు 94 ఏళ్లు. వీరి ఇరువురిని అతి కిరాత‌కంగా చంపేయ‌టం గ‌మ‌నార్హం. కేజే సింగ్ ను గొంతు కోసి చంప‌గా.. ఆయ‌న త‌ల్లిని గొంతు నులుమి చంపారు. అనారోగ్యంతో ఆమె కొన్నేళ్లుగా మంచంలోనే ఉన్నారు.

మెహాలీలోని ఫేస్ 3-బి2లోని వారింట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. మ‌ధ్యాహ్నం ఒంటిగంట స‌మ‌యంలో వారి దారుణ హ‌త్య విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వారి ఇంటికి సింగ్ సోద‌రి య‌శ్‌పాల్ కౌర్‌.. ఆమె కుమారుడు అజ‌య్ పాల్ లు లంచ్ చేసేందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఇంటి సింహ‌ద్వారం వ‌ద్ద ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉండ‌టం.. బ‌య‌ట గ‌డియ వేసి ఉండ‌టంతో సందేహం వ‌చ్చిన వారు లోప‌లికి వెళ్లి.. జ‌రిగిన ఘోరాన్ని చూసి షాక్ తిన్నారు. ఆ వెంట‌నే స‌మాచారాన్ని ఇవ్వ‌టంతో పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు.

రెండు గ‌దుల్లో శ‌వాలుగా ప‌డి ఉన్న వారిని చూస్తే దారుణ‌హ‌త్యకు గురైన‌ట్లు క‌నిపిస్తోంది. సింగ్ ఇంట్లో ఆయ‌న వినియోగించే ఫోర్డ్ ఐకాన్ కారు.. ఎల్ఈడీ టీవీ మాయం కాగా.. సింగ్ మెడ‌లోని బంగారు గొలుసును తాక‌లేదు. ఇక‌.. ఆయ‌న త‌ల్లి.. వృద్ధురాలి ప‌క్క‌నే ఉన్న ప‌ర్సులో రూ.25వేలు ప‌డి ఉన్నాయి. దోపిడీ జ‌రిగిన‌ట్లుగా క‌నిపించేలా దుండ‌గులు సీన్ క్రియేట్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. అయితే.. దోపిడీకి వ‌చ్చి హ‌త్య‌లు చేసి ఉండ‌ర‌ని.. ఈ ఘోరం వెనుక మ‌రేదో ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

సింగ్ ఒక‌ప్పుడు ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్‌.. ది టైమ్స్ ఆఫ్ ఇండియా.. ది ట్రిబ్యూన్ ల‌లో వివిధ హోదాల్లో ప‌ని చేశారు. ప్ర‌స్తుతం ఒక కెన‌డియ‌న్ ప‌త్రిక‌కు ప్రీలాన్స‌రుగా ప‌ని చేస్తున్నారు. ఆయ‌న ఇంట్లోనే ఒక రికార్డింగ్ స‌దుపాయాలున్న స్టూడియో ఉంది. ఘ‌ట‌న జ‌రిగిన ద‌గ్గ‌ర్లో సీసీ కెమేరాలు లేవు. ఈ ఘ‌ట‌న‌పై పంజాబ్ ముఖ్య‌మంత్రి సిట్ విచార‌ణ‌కు ఆదేశించారు. జ‌ర్న‌లిస్ట్ కుటుంబం దారుణ హ‌త్యకు గురి కావటంపై దేశ వ్యాప్తంగా ఉన్న జ‌ర్న‌లిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టులు హ‌త్యకు గురి కావ‌టం గ‌మ‌నార్హం.