Begin typing your search above and press return to search.

మమత భేటీకి జగన్ ఎందుకు వెళ్లనట్లు? ఆ భయమే వెళ్లకుండా చేసిందా?

By:  Tupaki Desk   |   16 Jun 2022 9:30 AM GMT
మమత భేటీకి జగన్ ఎందుకు వెళ్లనట్లు? ఆ భయమే వెళ్లకుండా చేసిందా?
X
తాను టార్గెట్ చేసిన వారి విషయంలో వైసీపీ నేతలు ఎలాంటి ప్రచారం చేస్తారో తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుకు దత్తపుత్రుడిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అదే పనిగా వ్యాఖ్యానించే వైసీపీ నేతలు.. అందుకు తగ్గ ఆధారాల్ని ఒక్కటంటే ఒక్కటి చూపింది లేదు. అయినప్పటికీ దత్తపుత్రుడన్న ప్రచారాన్ని అంతకంతకూ ముమ్మరం చేయటం ద్వారా.. లేని అనుమానాల్ని పెంచి పెద్దది చేయటమే లక్ష్యమన్నట్లుగా వారి తీరు ఉందని చెప్పాలి. గత ఎన్నికల సమయంలోనూ ప్యాకేజీ స్టార్ అన్న ప్రచారంతో పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే లక్ష్యాన్ని విజయంతంగా పూర్తి చేసింది వైసీపీ.

పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుందన్న చందంగా.. పవన్ ను దత్తపుత్రుడిగా పేర్కొనే జగన్ అండ్ కోనే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అసలుసిసలు దత్తపుత్రుడన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరే పరిణామాలు తాజాగా చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. కేంద్రం నుంచి స్పష్టం ఏం వచ్చినా రాకున్నా.. కిమ్మనకుండా ఉండే జగన్ కు.. ఆయన కోరే అప్పు విషయంలో మోడీ సర్కారు వెసులుబాటుతో వ్యవహరిస్తూ ఉంటుందని చెబుతారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా.. విభజన హామీలు నెరవేర్చకున్నప్పటికీ నోరు మెదపని జగన్ .. మోడీ దత్తపుత్రుడు కాక మరేమిటి? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా విపక్షాలు ఒక అభ్యర్థిని నిలిపేందుకు వీలుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో ఒక భేటీని నిర్వహించటం తెలిసిందే.

ఈ భేటీకి సంబంధించిన ఆహ్వానం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందిందా? లేదా? అన్న దానిపై సందేహాలు ఉన్నాయి. తాజాగా ఆ సందేహాలు తీరేలా టీఎంసీ నుంచి సమాధానం వచ్చేసింది.

ఏపీ సీఎం జగన్ కు బెంగాల్ ముఖ్యమంత్రి మమత రాసిన లేఖల్ని బయపెట్టాయి. భేటీకి జగన్ కు లేఖ రాసినప్పటికీ ఆయన రాలేదని వెల్లడించారు. సీబీఐకి భయపడే ఈ భేటీకి డుమ్మా కొట్టినట్లుగా టీఎంసీ నేతలు చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ వాదనకు బలం చేకూరేలా సీనియర్ జర్నలిస్టు పల్లవి ఘోష్ ట్వీట్ ఉందని చెబుతున్నారు. సీబీఐకి భయపడి.. తాజా భేటీకి హాజరు కావటానికి జగన్ నిరాకరించినట్లుగా తనకు టీఎంసీ నేతలు చెప్పినట్లుగా పల్లవి ఘోష్ ట్వీట్ తో స్పష్టం చేశారు. నిత్యం పవన్ ను చంద్రబాబు దత్తపుత్రుడిగా అభివర్ణించే జగన్.. తానే మోడీ మాష్టారికి అసలుసిసలు దత్తపుత్రుడన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేసిందని చెప్పాలి.