Begin typing your search above and press return to search.

నిర్మల్ మునుగుడులో ఒక మంత్రి? ఈటలకు మద్దతు పలికి సీనియర్ నేత

By:  Tupaki Desk   |   26 July 2021 2:03 AM GMT
నిర్మల్ మునుగుడులో ఒక మంత్రి? ఈటలకు మద్దతు పలికి సీనియర్ నేత
X
గతంలో ఎప్పుడూ లేని రీతిలో వర్షం తాకిడికి నిర్మల్ పట్టణం అంతలా మునిగిపోవటం ఇప్పుడు హాట్ చర్చగా మారింది. భారీ వర్షాలు ఇప్పుడే కురిసినట్లు.. మరెప్పుడూ జరగనట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయే తప్పించి.. సూటిగా.. సుత్తి కొట్టకుండా నిర్మల్ మునుగుడుకు కారణమేంది? అన్న విషయంపై ప్రధాన మీడియాలోనూ వార్తలు వచ్చిన వైనం తక్కువనే చెప్పాలి. అసలు వర్షం కురిస్తే.. నిర్మల్ లాంటి పట్టణాలు ఎందుకు మునుగుతాయి? అన్న ప్రాథమిక ప్రశ్నను పక్కన పెట్టేశారు. అయితే.. ఈ అంశంపై సీనియర్ నేత గోనె ప్రకాశరావు సంచలన ఆరోపణలు చేశారు.

నిర్మల్ పట్టణం మునుగుడులో తెలంగాణకు చెందిన ఒక మంత్రి పాత్ర కీలకంగా ఉందన్నారు. అతగాడి పుణ్యమా అని నిర్మల్ పట్టణం మునిగిపోయినట్లుగా చెప్పారు. పట్టణంలోని చెరువుల్ని ఒక మంత్రి కబ్జాపెట్టారని.. దీంతో వర్షం కురిసినప్పుడు చెరువుల్లోకి వెళ్లాల్సిన వాన నీరు.. పట్టణం చుట్టూ చేరి రాకపోకలపై తీవ్ర ప్రబావాన్ని చూపటమేకాదు.. కోలుకోలేని దెబ్బ తీసింది. అయితే.. ఈ దారుణం మొత్తానికి బాధ్యత సదరు మంత్రేనని గోనె ఆరోపిస్తున్నారు.

నిర్మల్ పట్టణం మునిగిపోవటానికి కారణమైన మంత్రిపై చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు భిన్నంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మాత్రం చర్యల కత్తిని ఝుళిపించారన్నారు. తప్పుల్ని ఏ మాత్రం క్షమించలేనట్లుగా రియాక్టు అయిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈటల మీద మాత్రం చర్యల కోసం అంత పట్టుదలతో వ్యవహరించారన్నారు. తన మీద వచ్చిన భూ కబ్జా ఆరోపణలు నిజమైన పక్షంలో తన భూముల్ని ప్రభుత్వానికి అప్పగిస్తానని ఈటల స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన వైనాన్ని గుర్తు చేశారు.

ఈటల మీద చరర్యలు తీసుకునేందుకు హడావుడి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నిర్మల్ పట్టణం మునగటానికి కారణమైన మంత్రి మీద మాత్రం ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ సూటిగా ప్రశ్నించారు. హూజూరాబాద్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల.. అవినీతికి అస్కారం లేకుండా వ్యవహరించారని.. అలాంటి వ్యక్తిపై ఎలా వేటు వేస్తారని ప్రశ్చించారు. అంతేకాదు.. హూజూరాబాద్ ఎన్నికల ఫలితం నిఘా పోలీసులకు అంతుచిక్కని రీతిలో అక్కడి ఓటర్లు తీర్పును ఇస్తారన్నారు.

ఈటలను ఓటమిపాలు చేసేందుకే దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారని ఆరోపించారు. తన మద్దతు మాజీ మంత్రికి ఇవ్వటానికి ఓకే చెప్పేశారు. ఈటల లాంటి రాజకీయ నేతను కాపాడుకోవాల్సిన బాధ్యత హూజూరాబాద్ ప్రజలదేనని స్పష్టం చేసిన గోనె ప్రకాశ్.. తన వరకు తాను మాత్రం ఈటలకే మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలచే గోనె ప్రకాశ్.. తాజాగా సీఎం మీదా.. ఒక మంత్రి మీదా చేసిన ఆరోపణలు మంట పుట్టిస్తున్నాయి. మరి.. దీనిపై ముఖ్యమంత్రి ఎలా రియాక్టు అవుతారో చూడాలి.