Begin typing your search above and press return to search.

జానాయే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షనా ?

By:  Tupaki Desk   |   9 Dec 2020 5:30 PM GMT
జానాయే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షనా ?
X
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో మాజీమంత్రి, సీనియర్ నేత జానారెడ్డే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈరోజు సాయంత్రం జానారెడ్డి గాంధీభవన్ కు చేరుకోగానే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆయన్ను పలకరించటం విచిత్రంగా కనిపించింది. నిజానికి జానారెడ్డి కాంగ్రెస్ నేతలకు కొత్తా కాదు. అలాగని గాంధీభవన్ తెలీంది కాదు. అయినా ఈ మాజీమంత్రిని చూడగానే ఎందుకు అంతమంది నేతలు వచ్చి కలిశారు ?

ఎందుకంటే జానారెడ్డి పార్టీ మారిపోతారనే ప్రచారం విపరీతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎంఎల్ఏ నోముల నర్సింహయ్య మరణించిన విషయం తెలిసిందే. నోముల మరణంతో హఠాత్తుగా రాజకీయం మొత్తం జానారెడ్డి చుట్టూనే తిరగటం మొదలుపెట్టింది. జానారెడ్డిని తమ పార్టీలో చేరి జరగబోయే ఉపఎన్నికల్లో పోటీ చేయమని టీఆర్ఎస్, బీజేపీలు ఒత్తిడి పెడుతున్నాయనే ప్రచారం తెలిసిందే.

దాంతో జానారెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నేత అయిపోయారు. ఇటువంటి నేపధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇన్చార్జి మాణిక్కం హైదరాబాద్ కు వచ్చారు. ఈరోజు గాంధీభవన్లో నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జానారెడ్డిపై జరుగుతున్న ప్రచారం కూడా చర్చల్లోకి వచ్చింది. దాంతో మాణిక్కం వెంటనే సీనియర్ నేతకు ఫోన్ చేసి మాట్లాడారు. అంతేకాకుండా సాయంత్రం వచ్చి నేరుగా కలుస్తానని ఉదయం ఫోన్ లో చెప్పారు.

సో ఉదయం చెప్పినట్లుగానే సాయంత్రం జానారెడ్డి గాంధీభవన్ కు వచ్చారు. దాంతో మాజీమంత్రిని చూసిన నేతలంతా దగ్గరకొచ్చి అదేపనిగా పలకరించటం విచిత్రమనిపించింది. తాను ఎప్పటికీ పార్టీలోనే ఉంటానని, తాను పార్టీ మారుతానని వచ్చేదంతా కేవలం ప్రచారం మాత్రమే అని చెప్పారు. అయితే ఏ నేత కూడా పార్టీ మారేంతవరకు ఆ విషయాన్ని బయటపెట్టరన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు పార్టీ మారిన వాళ్ళు కూడా ఇలా చెప్పిన వాళ్ళే.