Begin typing your search above and press return to search.

రేవంత్ ను పట్టించుకోని సీనియర్ నేతలు..?

By:  Tupaki Desk   |   3 March 2022 1:30 AM GMT
రేవంత్ ను పట్టించుకోని సీనియర్ నేతలు..?
X
కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర బాగా కలిసొస్తుంది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడానికి ఆయన చేసిన పాదయాత్రే కారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి 2004లో అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత ఆయన కుమారుడు విభజన ఏపీలో పాదయాత్ర చేసి 2019లో సీఎం అయ్యారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతున్న ప్రతి ఒక్కరూ పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారు.

ప్రస్తుత టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా త్వరలో పాదయాత్ర చేపట్టాలని ప్లాన్ వేస్తున్నాడు.అయితే అసంతృప్త నాయకుల పార్టీగా పేరున్న కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పాదయాత్రకు సపోర్టు రావడం లేదు. కొందరు ఆయన పాదయాత్రను వ్యతిరేకిస్తున్నారు. ఇంకొందరు కలిసిరావడం లేదు. కాంగ్రెస్ పార్టీని పట్టిపీడిస్తున్న ఈ సమస్యతో రేవంత్ రెడ్డి పాదయాత్ర సక్సెస్ అవుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2014 తరువాత నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతీ ఎన్నికల్లో ఓడుతూ వస్తోంది. 2018 ఎన్నికల్లోకొన్ని సీట్లు గెలుచుకున్నా.. పార్టీలోని కొందరు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. దీంతో అధిష్టానం రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలను అప్పజెప్పింది. అయితే రేవంత్ రెడ్డి వచ్చిన కొత్తలో ఇకనైనా పార్టీ పరిస్థితి మారుతుందని భావించారు. మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కాగానే హల్ చల్ చేశారు. ముందుగా అసంతృప్త నేతలను కలుస్తూ వచ్చారు. ఆ తరువాత గిరిజన దండోరా పేరుతో పలు సభలను నిర్వహించారు.

అయితే కొన్నాళ్లు రేవంత్ చేసిన హడావుడితో పార్టీ క్యాడర్లో జోష్ నింపినట్లయింది. అంతేకాకుండా కేసీఆర్ ను టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేయడంతో కొంత మంది టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొంత మంది టీఆర్ఎస్ ను వీడేందుకు రెడీ అవుతున్నారు. అయితే మరోవైపు బీజేపీ ఎదుగుతున్న కొందరు మతతత్వ భావన ఉండొద్దన్న ఆలోచనతో కాంగ్రెస్లోకి చేరారు. దీంతో ఇక వచ్చే ఎన్నికల వరకు పార్టీ పరిస్థితి మారుతుందని అనుకున్నారు.

కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు ఈ ఉప ఎన్నిక గురించి పట్టించుకోలేదని, దీంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకును బీజేపీకి అప్పజెప్పినట్లయిందని రేవంత్ ఫై పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి లాంటి కొందరు నేతలు ఫైర్ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి వారి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగారు. అయితే తాజాగా ఈ అసమ్మతి మరీ ఎక్కువైనట్లు తెలుస్తోంది.

ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పాటుమరోవైపు ముందస్తు ఊహాగానాలు వెలువడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే ఈ విషయాన్ని తమతో చర్చించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ప్రతీ విషయాన్ని పార్టీతో చర్చించాలని పట్టుబడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి వర్గం తమకు నచ్చని వారిని దూరం పెడుతోందని, అందుకే రేవంత్ రెడ్డికి సపోర్టు చేయడం లేదని చర్చ జరగుతోంది. అయితే కొత్తనాయకుడొస్తే సెట్టవుతుందనుకున్న కాంగ్రెస్ ఇంకెప్పుడు మారుతుందోనని కిందిస్థాయి నాయకులు చర్చించుకుంటున్నారు.