Begin typing your search above and press return to search.

ఇహనేం... పవర్లోకి వచ్చేస్తున్నాం...

By:  Tupaki Desk   |   5 May 2022 5:23 AM GMT
ఇహనేం... పవర్లోకి వచ్చేస్తున్నాం...
X
ఒక గెలుపు ఒక ఓటమి, మళ్లీ గెలుపు అదే రాజకీయం పిలుపు. సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబుకు ఇవన్నీ బాగా తెలుసు. అయినా ఆయన బేలతనంగానే ఇన్నాళ్ళూ గడిపారు. ఆ మాటకు వస్తే ఈ రోజుకు కూడా ఆయన తాను ఎందుకు ఓడిపోయానో అర్ధం కాకుండా ఉన్నారు. వందకు పైగా సీట్లను 2014లో సాధిస్తే 2019లో అవి కాస్తా 23కి జారిపోవడంతోనే అధినాయకుడి గుండె ధైర్యం జారిపోయిందా అంటే ఆయన నాడు చేసిన వ్యాఖ్యానాలు, ఇచ్చిన ప్రకటనలు చూసి అంతా అదే అనుకున్నారు.

ఇంకేముందు టీడీపీ పని సరి అని కూడా అనేక రకాలైన రాజకీయ విశ్లేషణలు కూడా వచ్చాయి. అయినా సరే చంద్రబాబు అమరావతి రాజధాని మీద రైతులతో కలసి తుది వరకూ పోరాడారు. అనేక ఇతర ప్రజా సమస్యలను కూడా టచ్ చేస్తూ గళాన్ని విప్పుతూ జనాల్లోకి వచ్చారు. మధ్యలో కరోనా రెండేళ్ళు ఇబ్బంది పెట్టినా బాబు మాత్రం రాజకీయాన్ని అసలు ఏ కోశానా వదలలేదు, జూమ్ మీటింగ్స్ ద్వారా పార్టీ క్యాడర్ కి ఎప్పటికపుడు దిశా నిర్దేశం చేస్తూ వచ్చారు.

అయినా సరే ఎందుకో టీడీపీలో ఎటు చూసినా నిర్లిప్తత. ఏ వైపు నుంచి విన్నా ఏం చేస్తాం, ఏం చేయగలం అన్న వేడి నిట్టూర్పులు, లీడర్లు కదలిరారు, క్యాడర్ లో నిస్పృహ. ఈ నేపధ్యంలోనే మూడేళ్ళూ మెల్లగా గడచిపోయాయి. ఈ మధ్యలో వచ్చిన లోకల్ బాడీ ఎన్నికల నుంచి ప్రతీ ఎన్నికలోనూ టీడీపీని వరసగా ఆనేక పరాజయాలు పలకరించి వెక్కిరించాయి.

మరో రెండేళ్ళలో ఎన్నికలు ఉండగా చంద్రబాబు తాను సెంటిమెంట్ గా నమ్ముకున్న ఉత్తరాంధ్రాలో తొలి పాదం మోపారు. టీడీపీకి ఒకనాటి కంచుకోట అయిన శ్రీకాకుళం నుంచే తన జిల్లా టూర్లు స్టార్ట్ చేశారు. బాదుడే బాదుడు పేరిట ఆముదాల వలస పొందూరు మండలంలో బాబు నిర్వహించిన సభకు జనాలు పోటెత్తారు. అంతకు ముందు బాబు శ్రీకాకుళం వైపుగా వస్తూంటే జనాల నీరాజనాలు రోడ్లకు ఇరువైపులా కనిపించి ఆయనలో వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చాయి. ఇందులో మహిళలు లెక్కకు మిక్కిలిగా ఉండడం గమనార్హం.

అందుకేనేమో పొందూరు సభలో బాబు ఏకంగా మనం అధికారంలోకి వచ్చేస్తున్నామన్న ధీమాను వ్యక్తం చేశారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఈ మాదిరి జనాదరణను టీడీపీ ఊహించింది లేదు, మూడేళ్ళలో బాబు అలసిపోకుండా ఎక్కడ చూసినా జనాల్లోకి వస్తూనే ఉన్నారు. కానీ నాటి స్పందన కడు పేలవంగా ఉంటే ఈసారి చూస్తే బహు గట్టిగానే ఉంది.

దాంతో చంద్రబాబు ముఖం నిండు పున్నమి చంద్రుని మాదిరి వెలిగిపోతోంది. ఆయన వెంట ఉన్న టీడీపీ నాయకులు కూడా వచ్చేది మన సర్కారే అని ఢంకా భజాయించేస్తున్నారు. ఇక రాజకీయ గాలి ఏ వైపు ఉందో ముందే ఊహించి దానికి అనుగుణంగా పావులు కదిపే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వారు టీడీపీలో మళ్లీ కుదురుకుంటున్నారు అంటనే పసుపు ప్రాభవానికి వన్నె పెరుగుతోందనే అర్ధం.

మొత్తానికి సిక్కోలు తొలి మీటింగ్ తోనే సక్సెస్ కొట్టిన చంద్రబాబు కరోనా కంటే ప్రమాదకారి అయిన ఈ జగన్ మనకు అవసరమా అని డేరింగ్ గానే జనాలను ప్రశ్నిస్తున్నారు. మరి బాబుకు లభిస్తున్న ఈ విశేష జనాదరణ ఏ మార్పుకు, మరే తీర్పుకు సూచిక అన్నది అధికార వైసీపీ మనసు పెట్టి నిజాయతీగా ఆత్మవిమర్శ చేసుకుంటే రేపటి ఎన్నికల్లో ఏమైనా ప్రయోజనం కలిగే వీలుంటుంది.