Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై సీనియర్ల గుస్సా

By:  Tupaki Desk   |   2 April 2017 5:54 AM GMT
చంద్రబాబుపై సీనియర్ల గుస్సా
X
చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించడంతో తెలుగుదేశం పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. ముఖ్యంగా సీనియర్ల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీకాకుళం:

1985 నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పలాస శాసనసభ్యుడు గౌతు శ్యామసుందర్ శివాజీ అసంతృప్తితో రగులుతున్నారు. డీలిమిటేషన్ కు ముందు సోంపేట నుంచి 1985 నుంచి 2004 వరకు వరుసగా అయిదుసార్లు గెలిచారాయన. డీలిమిటేషన్ తరువాత సోంపేట నియోజకవర్గం రద్దవడంతో 2009లో పలాస నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఓటమిపాలయ్యారు. మళ్లీ 2014లో అదే నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. శ్రీకాకుళం జిల్లాలో కళావెంకటరావు, శివాజీలు మాత్రమే సీనియర్ నేతలు. కళాకు ఛాన్సిచ్చి తనకు ఇవ్వకపోవడంతో శివాజీ మండిపడుతున్నారు. తండ్రికి మంత్రి పదవి ఇవ్వలేదంటూ ఆ జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న గౌతు శిరీష కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

విజయనగరం:

ఈ జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పతివాడ నారాయణ స్వామి నాయుడు ఏపీ అసెంబ్లీలోనే అత్యంత సీనియర్ 1983 నుంచి ఆయన ఏడు సార్లు గెలిచారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఆయనకు స్పీకర్ పదవి ఇస్తారన్న సంకేతాలు వచ్చినా అది జరగలేదు. తాజాగా ఆయన మంత్రిపదవిపైనా ఆశ పెట్టుకున్నారు కానీ ఫలితం లేకపోవడంతో ఆగ్రహంగా ఉన్నారు.

అదే సమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యే, బొబ్బిలిరాజు సుజయ కృష్ణ రంగా రావుకు మంత్రి పదవి ఇవ్వడంపై కేంద్ర మంత్రి అశోక్ గజపతి కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ జిల్లాలోని సీనియర్ ఎమ్మెల్యేలు కోళ్ల లలిత కుమారి, ఇతర ఎమ్మెల్యేలు కూడా రంగారావుకు పదవి ఇవ్వడంపై మండిపడుతున్నారు.

విశాఖపట్నం:

ఈ జిల్లాలో బండారు సత్యానారాయణ, వంగలపూడి అనిత ఇద్దరూ నిరాశకు గురయ్యారు. బండారు సీనియర్ నేత. 2014లో టీడీపీ ప్రభుత్వం రాగానే ఆయనకు మంత్రి పదవి వస్తుందని అంతా ఆశించారు కానీ రాలేదు. ఇప్పుడు ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురయినట్లు చెబుతున్నారు.

అలాగే శాసనసభలో నిత్యం రోజాపై విరుచుపడుతూ చంద్రబాబు దృష్టిలో పడ్డానని భావించిన వంగలపూడి అనితకూ నిరాశ తప్పలేదు.

తూర్పుగోదావరి:

మంత్రి పదవి ఇస్తామని వైసీపీ నుంచి తీసుకొచ్చిన జ్యోతుల నెహ్రూకు చంద్రబాబు ఆశాభంగం కలిగించారు. దీంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. చంద్రబాబు చేతిలో మళ్లీ మోసపోయానని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

పశ్చిమగోదావరి:

ఏం చేసినా చెల్లిపోతున్న నేత తఎవరైనా ఉన్నారంటే అది చింతమనేని ప్రభాకరే. అధికారులపై దాడులు చేసినా.. ఇంకా ఏమేం చేసినా.. చంద్రబాబు పిలిచి మందలించినా కూడా అందమైన నవ్వు ఒకటి విసిరి మాటలతో మేజిక్ చేసేసే చింతమనేనికి చంద్రబాబు వద్ద మంచి గ్రిప్పే ఉంది. ఆ లెక్కలతోనే ఆయన పదవిపై ఆశ పెట్టుకున్నారు. కానీ.. అదేమీ లేకపోవడంతో ఆయన బాగా అప్సెట్ అయిపోయారట.

అదే జిల్లాలో ఎమ్మెల్సీ షరీఫ్ పేరు చాలాకాలంగా చక్కర్లు కొట్టినా ఆయనకూ పదవి రాలేదు.

కృష్ణా జిల్లా:

రాజధాని జిల్లా కృష్ణా నుంచి దూకుడు గల నేతగా.. కాపు వర్గానికి చెందినవారిగా మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు బొండా ఉమ. పైగా ఆ జిల్లాకు చెందిన కొందరు నేత సపోర్టు కూడా ఆయనకు ఉంది. అయినా చంద్రబాబు ఛాన్సివ్వకపోవడంతో ఉమా షాకైపోయారు. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన రాలేదు.

గుంటూరు:

సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, కాగిత వెంకట్రావులు ఈ జిల్లా నుంచి మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్నా అవి అడియాశలే అయ్యాయి.

నెల్లూరు: నెల్లూరులో పదవిని ఆశించి భంగపడినవారు లేకున్నా సోమిరెడ్డికి ఇవ్వడంపై మండిపతున్న నేతల సంఖ్య భారీగా ఉంది.

చిత్తూరు: ఈ జిల్లాలో మంత్రి పదవి పోగొట్టుకున్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా పంపించారు.

అనంతపురం: మంత్రి పదవి అశించిన పయ్యావుల కేశవ్ నిన్న సాయంత్రం నుంచి చంద్రబాబు పేరెత్తితే చాలు ఒంటికాలిపై లేస్తున్నారట.

అలాగే పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి కూడా తన సీనియారిటీని గుర్తించలేదని మండిపడుతున్నారు.

కడప: ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి పదవి ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి ఫైర్ అవుతున్నారు. గవర్నరు కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబే స్వయంగా ఆయనకు ఆశ చూపించినా కూడా వినడం లేదని టాక్.

** ఒంగోలు - కర్నూలు జిల్లాల్లో మాత్రమే అసంతృప్తులు కనపడడం లేదు. అధిష్ఠానం తీరును గమనించి ఇక్కడి నేతలు ముందే అశలు వదులుకున్నారు. ప్రకాశంలో కరణం బలరాంకు మనసులో కోరిక ఉన్నా చంద్రబాబు తనకు ఇవ్వరని ఆయన ముందే డిసైడవడంతో ఇప్పుడు కొత్తగా వెళ్లగక్కే అసంతృప్తేమీ లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/