Begin typing your search above and press return to search.

నారాయ‌ణ కుంప‌టి రాజేస్తున్నాడు బాబు

By:  Tupaki Desk   |   3 July 2016 9:39 AM GMT
నారాయ‌ణ కుంప‌టి రాజేస్తున్నాడు బాబు
X
ఏపీ పుర‌పాల‌క శాఖా మంత్రి నారాయ‌ణ తీరుపై చంద్ర‌బాబు మంత్రివర్గంలో సీనియర్లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారా? త‌మ‌ను పక్కనపెట్టి మంత్రి నారాయణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ఏపీ మంత్రుల్లో నిరుత్సాహం రాజుకుంటోందా? తాత్కాలిక స‌చివాల‌యం త‌ర్వాతి ప‌రిణామాలే ఇందుకు నిద‌ర్శ‌న‌మా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

రాజధాని నగర నిర్మాణం - తాత్కాలిక సచివాలయంపై నారాయణకు పెత్తనం ఇవ్వడాన్ని మంత్రులు సహించలేకపోతున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఉద్యోగులను తరలించకుండా, అనవసర ప్రతిష్ఠకు పోయిన వ్యవహారం, ఉద్యోగులంతా ఒక్కరోజులోనే తిరిగి వెళ్లడంతో అప్రతిష్ఠపాలవాల్సి వచ్చిందని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగులను పిలిపించి ఉండాల్సి ఉండగా, మంత్రి నారాయణ అత్యుత్సాహం వల్ల - ఏర్పాట్లు అసంపూర్తిగా ఉండటంతో ఉద్యోగులు ఒక్కరోజు మాత్రమే పనిచేసి - తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చిందని, దీనికి తమ బాధ్యత లేదని కొంద‌రు మంత్రులు స్పష్టం చేస్తున్నారు. అసలు వెలగపూడిలోనే కాదు - అమరావతిలో కూడా ఏం జరుగుతోందో తమకు తెలియడం లేదంటున్నారు. వెలగపూడిలో పనిచేద్దామని ఐదు బస్సుల్లో వచ్చిన ఉద్యోగులకు అక్కడ సరైన సౌకర్యాలు కల్పించలేదని, అన్నీ వేళ్లాడుతూ కనిపిస్తున్నాయని, రోడ్డంతా బురదమయం అయిందని ఉద్యోగులు తమకు ఫిర్యాదు చేస్తే, తాము వారికి ఎలాంటి సమాధానం చెప్పలేకపోయామని ప‌లువురు మంత్రులు స‌న్నిహితుల వద్ద అంటున్నారు. నారాయణ అత్యుత్సాహం వల్ల - ఉద్యోగులంతా వెనక్కి వెళ్లిపోవలసి వచ్చిందని మంత్రులు తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. తాత్కాలిక సచివాలయానికి తరలింపు అంశంపై నారాయణ అనవసర ప్రతిష్ఠకు వెళ్లడం వల్లనే ఇంత రాద్ధాంతం జరిగిందని, అదే కొద్దిరోజులు ఆలస్యమైనప్పటికీ, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తరలించి, హైదరాబాద్‌ లోని సచివాలయ సిబ్బందిని రిలీవ్ చేసి పంపి ఉంటే ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగేదంటున్నారు.

చివరకు 27న ప్రారంభం కావలసిన తాత్కాలిక సచివాలయ భవనం రెండురోజులు ఆలస్యంగా ప్రారంభమయిందని, ఆ విషయం కూడా తమకు జిఏడి అధికారులు చెబితేనే తెలిసిందని మంత్రులు వాపోతున్నారు. ఆ కార్యక్రమానికి మంత్రులంతా రావలసి ఉన్నప్పటికీ, కేవలం అయ్యన్నపాత్రుడు - మృణాళిని మాత్రమే వచ్చారు. తాత్కాలిక సచివాలయం - అమరావతి వ్యవహారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తమతో సంప్రదించడం లేదని, దానితో మీడియా నుంచి వచ్చే ప్రశ్నలకు తాము సమాధానం చెప్పుకోవలసిన సంకటం వచ్చిందని కొంద‌రు మంత్రులు చ‌ర్చించుకుంటున్నారట‌. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమతో అన్ని విషయాలు సంప్రదించిన బాబు, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కేవలం నారాయణతోనే అభిప్రాయాలు పంచుకుంటున్నారన్న వ్యాఖ్యలు మంత్రుల నుంచి వినిపిస్తున్నాయి. నారాయణకు అధిక ప్రాధాన్యం ఇచ్చి - తనకు సంబంధించిన రెవిన్యూ వ్యవహారాలను కూడా ఆయనకే అప్పగించడంతో రెవిన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి కూడా చాలాకాలం నుంచి అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.