Begin typing your search above and press return to search.

ఆవేశంలో ట్రాక్ త‌ప్పేస్తున్నారా? బాబు వైఖ‌రిపై సీనియ‌ర్ల గుస‌గుస‌

By:  Tupaki Desk   |   10 April 2021 10:30 AM GMT
ఆవేశంలో ట్రాక్ త‌ప్పేస్తున్నారా?  బాబు వైఖ‌రిపై సీనియ‌ర్ల గుస‌గుస‌
X
రాష్ట్రాన్ని అభివృద్ది చేయాల‌నే త‌ప‌న‌.. దేశంలోనే ముందుగా నిల‌బెట్టాల‌నే ఆలోచ‌న‌.. ఈ క్ర‌మ‌లో న‌వ్యాం ధ్రలో తాను వేసిన అడుగులు మ‌ధ్య‌లోనే(2019 ఎన్నిక‌లు) ఆగిపోయాయ‌నే బాధ‌.. వెర‌సి.. టీడీపీ అధినేత చంద్ర‌బాబును తీవ్రంగా కుదిపేస్తున్నాయ‌నేది వాస్త‌వం. మ‌రోవైపు.. రాష్ట్రంలో వైసీపీ స‌ర్కారు అభివృద్ధిని విడిచి పెట్టి.. పందేర ప‌ధ‌కాలు న‌మ్ముకుని ముందుకు సాగుతుండ‌డంతో రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారుతోంద‌ని ఆవేద‌న కూడా చంద్ర‌బాబుకు ఉన్న‌మాట వాస్త‌వ‌మే. ఇది రాజ‌కీయ కోణంలోనే కాకుండా.. రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రిగా కూడా ఆయ‌న త‌పిస్తున్న మాట‌.

అయితే.. ఈ అభివృద్ధి ఆవేద‌న‌.. రాష్ట్రం ఎటు పోతుందోన‌నే బాధ వంటివి చంద్ర‌బాబులో ఒక విధ‌మైన ఆక్రంద‌న‌ను రెచ్చ‌గొడుతున్న‌ట్టుగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీలకులు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నిదానంగా.. నింపాదిగా మాట్లాడి.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయాల్సిన ఆయ‌న‌.. ట్రాక్ త‌ప్పేస్తున్నార‌ని హెచ్చరిస్తున్నారు. గ‌త నెల‌లో జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో విజ‌య‌వాడ‌, గుంటూరు ప్ర‌చార స‌భ‌ల్లోనూ ఇలానే ట్రాక్ త‌ప్పేసి.. ప్ర‌జ‌ల‌ను బుజ్జ‌గించాల్సిన చోట రెచ్చ‌గొట్టేశారు. దీంతో ఇంత శ్ర‌మించి.. ఎండ‌లో ప్ర‌చారం చేసినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు.

ఇక‌, ఇప్పుడు అత్యంత కీల‌క‌మైన తిరుప‌తి బైపోల్‌లో ఏకంగా వారం రోజుల పాటు ప్ర‌చారం కోసం రంగంలోకి దిగిన చంద్ర‌బాబు.. మ‌రోసారి ట్రాక్ త‌ప్పుతున్నార‌ని ఈయ‌న ప్ర‌చారాన్ని గ‌మ‌నిస్తున్న పార్టీ సీనియ‌ర్లు, మేధావులు సైతం అంటున్నారు. తిరుప‌తి బై పోల్‌లో ప్ర‌స్తావించాల్సిన విష‌యాల‌ను వ‌దిలేసి.. అంత‌ర్జాతీయ సెమినార్‌లోనో.. పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశాల్లోనో ప్ర‌సంగించిన‌ట్టు చంద్ర‌బాబు మాట్లాడుతున్నార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌గా ఉంది. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డం లేదా.. జ‌గ‌న్‌ను తిట్ట‌డం వ‌ల్ల‌.. ఇప్పుడు ఫ‌లితం రాబ‌ట్టుకునే ప్ర‌య‌త్నం ఫ‌లితం ఇవ్వ‌ద‌ని.. అంటున్నారు.

ప్ర‌భుత్వంలోని లోపాల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తే.. ఫ‌లితం వ‌స్తుంద‌ని.. అంటున్నారు. ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. మ‌హిళ‌ల్లో జ‌గ‌న్‌పై సింప‌తీ ఉంది. అమ్మ ఒడి కావొచ్చు.. పింఛ‌న్లు కావొచ్చు, పేద‌ల‌కు ఇళ్లు కావొచ్చు.. వివిధ రూపాల్లో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. దీని నుంచి మ‌హిళ‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకురాకుండా.. చేసే ఏ ప్ర‌సంగ‌మైనా.. ప్ర‌చార‌మైనా.. చంద్ర‌బాబు ఫ‌లించ‌ద‌ని మేధావులు అంచ‌నా వేస్తున్నారు. దీనిని అనుస‌రించి ఆయ‌న త‌న విధానాన్ని మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రో ఐదు రోజులు ప్ర‌చారానికి అవ‌కాశం ఉంది క‌నుక‌.. ఇప్ప‌టికైనా వాస్త‌వాలు గ్ర‌హించాలని సూచిస్తున్నారు.