Begin typing your search above and press return to search.

రష్యా యుద్ధ విరమణ కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   28 March 2022 2:30 PM GMT
రష్యా యుద్ధ విరమణ కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన
X
యుద్ధం మిగిల్చిన విషాదం ఉక్రెయిన్ దేశాన్ని వెంటాడుతోంది. అక్కడి ప్రజలు పొట్ట చేత పట్టుకొని విదేశాలకు వలస పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రజలు, ఇరు దేశాల సైనికులు చనిపోయారు. శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన ప్రకటన చేశారు. యుద్ధ సంక్షోభానికి ముగింపు పలికే దిశగా ఆయన ప్రకటన ఉండడం విశేషం.

ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక మెట్టు వెనక్కి తగ్గాడు. ఆదివారం రాత్రి నేరుగా రష్యా జర్నలిస్టులతో మాట్లాడారు. తద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చేరేలా చూశాడు. తాము ఇక ఏ దేశంతోనూ కలవకుండా తటస్థ వైఖరి అవలంభించేందుకు సిద్ధమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశాడు.

మూడో పార్టీ సమక్షంలో తప్పనిసరి ఒప్పందం, రెఫరెండానికి సిద్ధమంటూ జెలెన్ స్కీ పేర్కొన్నాడు. శాంతి ఒప్పందంలో భాగంగా తూర్పు డోనాబాస్ ప్రాంతం విషయంలో తటస్థంగా ఉండడంతోపాటు వెనక్కి తగ్గేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆదివారం రష్యా జర్నలిస్టుల సమక్షంలో జెలెన్ స్కీ ప్రకటించాడు.

ఉక్రెయిన్ కు భద్రతా హామీలు, తటస్థ, అణురహిత స్థితి.. ఈ అంశాలపై శాంతి చర్చలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం' అంటూ రష్యన్ భాషలోనే జెలెన్ స్కీ ప్రసంగించడం విశేషం. ఇక జెలెన్ స్కీ ప్రసంగాలు, ఉక్రెయిన్ పరిణామాలపై కథనాలు ప్రసారం చేయకూడదని అక్కడి జర్నలిస్టులకు రష్యా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.అయినప్పటికీ శాంతి కోరే దిశగా కీలక ప్రకటన కావడంతో ఈ వాళ్లు ఈ కథనం ప్రసారం చేశారు.

ఇక మరోవైపు ఆదివారం పుతిన్, టర్కీ అధ్యక్షుడు టాయిప్ ఎర్డోగాన్ మధ్య చర్చలు జరిగాయి. రష్యా-ఉక్రెయిన్ నడుమ కాల్పుల విరమణ,పౌరుల సురక్షిత తరలింపు అంశాలపై టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ మేరకు చర్చలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

శనివారం పోల్యాండ్ పర్యటన సందర్భంగా పుతిన్ ఇక అధికారంలో ఉండడంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అమెరికా భద్రతా ప్రతినిధి మాత్రం భిన్నంగా స్పందించారు.