Begin typing your search above and press return to search.

ఏపీలో పెద్ద మాటల్ని చెప్పిన జవదేకర్

By:  Tupaki Desk   |   29 Dec 2021 4:30 AM GMT
ఏపీలో పెద్ద మాటల్ని చెప్పిన జవదేకర్
X
రహస్య స్నేహితుల మాదిరి వ్యవహరిస్తూ.. కత్తి దూసినట్లే దూస్తూ.. అభయ హస్తం ఇస్తూ ఏపీలోని జగన్ సర్కారు తో విచిత్రమైన అనుబంధం బీజేపీ సొంతంగా చెబుతుంటారు. అలాంటిది.. అందుకు భిన్నంగా వ్యవహరించారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్. ఏపీ కి వచ్చిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోని ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేసిన ఆయన.. అందుకు భిన్నంగా ఊహించని విధంగా మాట్లాడిన అందరి నోట్లో నానారు.

ఏపీ లో బెయిల్ మీద ఉన్న నేతలు ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చని పేర్కొంటూ.. రాష్ట్రం లో విధ్వంసకర పాలన సాగుతుందని.. ఇచ్చిన హామీలేవీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెర వేర్చలేదన్నారు. ప్రాంతీయ పార్టీలకు కుటుంబ ప్రయోజనాలు.. అవినీతి తప్పించి.. డెవలప్ మెంట్ పట్టటం లేదన్నారు. తెలుగు ప్రజల్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు.. టీడీపీలు మోసం చేశాయన్న ఆయన.. ఏపీకి మేలు చేసేది బీజేపీ మాత్రమేనని చెప్పారు.

జగన్ ఆరాచక పాలన.. వైఫల్యాలపై బీజేపీ బెజవాడ లో నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభకు హాజరై ప్రసంగించారు. విభజిత రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరమైన పోలంవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాను కేంద్ర పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడు 2014 లోనే అనుమతిస్తే.. టీడీపీ.. వైసీపీ ప్రభుత్వాలు రెండు ఇప్పటికి నీళ్లు అందించలేకపోయాయన్నారు. రాజధాని అమరావతి కోసం అటవీ భూముల్ని బదిలీ చేశామని.. ఇక్కడి రెండు పార్టీలు రాజధాని ఎక్కడనే దాని కోసం కొట్టుకుంటున్నట్లు చెప్పారు.

సంపూర్ణ మద్య నిషేధమని మాటిచ్చిన జగన్ ప్రజల్ని మోసగించారన్నారు. ఓట్ల కోసం ఇచ్చిన హామీని అధికారం చేతికి రాగానే మర్చిపోయి మడమ తిప్పేశారన్నారు. కేంద్ర పథకాలకు తన పేరు పెట్టుకుంటున్నారని.. కేంద్రం ఇస్తున్న నిధులతో తన స్టిక్కర్లు వేసుకుంటున్నారని చెబుతూ.. ‘‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి ఒక్కో లబ్థిదారుడికి కేంద్రం రూ.1.60 లక్షలు ఇస్తోంటే.. ఆ కాలనీలకు జగన్ పేరు పెట్టుకోవటంఏమిటి? మోడీ ఇస్తున్న నిధులతో నిర్మించేవి మోడీ కాలనీలే కానీ జగనన్న కాలనీలు ఎంత మాత్రం కాబోవు అని చెప్పారు. పోలీసు, ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్ట్‌ లేబర్‌ పర్మినెంట్‌, రైతులకు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ ఇలా చెబుతూ పోతే అన్నింటా మడమ తిప్పడమేనన్నారు.

మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచం లో భారతీయులు ఎక్కడికెళ్లినా గౌరవం లభిస్తోందని.. అయోధ్య, కాశీ, ఛార్‌ధామ్‌ తరహాలో దేశ మంతా అభివృద్ధి చెందుతోందన్నారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని తగలెట్టటం.. రామతీర్థం లో స్వామి వారి విగ్రహ శిరచ్ఛేదం ఘటనల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్ల చెప్పారు. మొత్తంగా చూసినప్పుడు జగన్ పాలనను తీవ్రం గా విమర్శించటం.. వేలెత్తి చూపించేలా జవదేకర్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. మరి.. ఈ విమర్శలకు అధికార పార్టీ నేతలు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.