Begin typing your search above and press return to search.

నా నియోజ‌క‌వ‌ర్గాన్ని తెలంగాణ‌లో క‌లిపేయండి: క‌ర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌

By:  Tupaki Desk   |   12 Oct 2021 5:36 AM GMT
నా నియోజ‌క‌వ‌ర్గాన్ని తెలంగాణ‌లో క‌లిపేయండి: క‌ర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌
X
రాజ‌కీయాల్లో నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నాల‌కు కేంద్రంగా ఉన్నాయి. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. నాయ‌కులు నోరు విప్పితే.. సంచ‌ల‌నాలు ఊడిప‌డుతున్నాయి. ఈ కోవ‌లోనే క‌ర్ణాట‌క‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ శివ‌రాజ్ పాటిల్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు.. సంచ‌ల‌నం సృష్టించ‌డంతోపాటు తెలంగాణ బీజేపీకి చుర‌క‌ల‌టించాయి. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని తెలంగాణ‌లో క‌లిపేయాల‌ని.. పాటిల్ వ్యాఖ్యానించారు. పాటిల్ రాయ‌చూర్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఓ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన ఆయ‌న‌.. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని తెలంగాణ‌లో విలీనం చేయాల‌ని.. అన్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి.. స‌భ‌లో ఉన్న వారి నుంచి హ‌ర్షం వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో పాటిల్ వ్యాఖ్య‌ల వీడియో సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇక‌, ఈ వీడియో చూసిన తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌.. ఎడ్వాంటేజ్ తీసుకుంది. టీఆర్ ఎస్ యువ నాయ‌కుడు.. క్రిశాంక్ ఈ వీడియోను షేర్ చేయ‌గా.. దీనికి టీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్‌.. రీట్వీట్ చేశారు.

``తెలంగాణ విలువ ఏంటో... స‌రిహ‌ద్దుల‌కు ఆవ‌ల నుంచి కూడా వ్య‌క్త‌మ‌వుతున్న అభిప్రాయాల‌ను బ‌ట్టి తెలుస్తోంది. క‌ర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే త‌న నియోజ‌క‌వ‌ర్గం రాయ‌చూర్‌ను తెలంగాణ‌లో విలీనం చేయాల‌ని అన‌డాన్ని బ‌ట్టి రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతోందో.. రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అందరికీ అర్ధ‌మ‌వుతోంది. అంతేకాదు.. ఆయ‌న ప్ర‌క‌ట‌న‌ను.. స‌భికులు, కార్య‌క‌ర్త‌లు చ‌ప్ప‌ట్ల‌తో స్వాగ‌తించారు`` అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే.. టీఆర్ ఎస్ తొలి ఐదేళ్ల‌(మ‌ధ్య‌లోనే ముగించార‌నుకోండి) పాల‌న‌లో ఇదే త‌ర‌హా డిమాండ్ మ‌హారాష్ట్ర నుంచి వ్యక్త‌మైంది. అక్క‌డి నాందేడ్ ప్ర‌జ‌లు త‌మ‌ను తెలంగాణ‌లో విలీనం చేయాలంటూ.. డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో స్థానిక నాయ‌కుల ప్ర‌తినిధి బృందం ఒక‌టి.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో భేటీ అయి.. ఈ విష‌యంపై చ‌ర్చించింది. ఆ స‌మ‌యంలో మ‌హారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్ర‌భుత్వం ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఇప్పుడు క‌ర్ణాట‌క‌కు చెందిన ఎమ్మెల్యే పాటిల్ కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని తెలంగాణ‌లో విలీనం చేయాలంటూ.. ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆస‌క్తిగా మారింది. దీనికి తెలంగాణ‌లోని టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ పాల‌న‌పై వారు సంతోషంగా ఉన్నార‌నే క‌దా.. అంటున్నారు తెలంగాణ అధికార పార్టీ నాయ‌కులు. ఈ ప‌రిణామం .. రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. బీజేపీకి ఇబ్బందిగా మారింది. ఎందుకంటే.. ఇత‌ర రాష్ట్రాల్లోని త‌మ నాయ‌కులు.. ఇలా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని పొగ‌డ‌డం.. తాము విమ‌ర్శించ‌డం.. ఇబ్బందిగా ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ తాజా విష‌యంపై తెలంగాణ బీజేపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.