Begin typing your search above and press return to search.

ఎన్నారైలకి కేంద్రం శుభవార్త .. ఆధార్ పై సంచలన నిర్ణయం !

By:  Tupaki Desk   |   28 Aug 2021 6:31 AM GMT
ఎన్నారైలకి కేంద్రం శుభవార్త .. ఆధార్ పై సంచలన నిర్ణయం !
X
చదువు , ఉద్యోగం కోసం ఇతర దేశాలలో ఉన్న ప్ర‌వాస భార‌తీయుల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు వారు ప‌డుతున్న ఇబ్బందుల‌ను పరిగణలోకి తీసుకోని కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నారైలు ఇండియా కి వ‌చ్చిన‌ సమయంలో, వారు ఆధార్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే, వారికీ ఆధార్ రావడానికి కనీసం అంటే 6 నెల‌లు ప‌ట్టేది. సమయం ఎక్కువ కావడంతో అటువంటి వారు ఇబ్బందులు ఎదుర్కొనే వారు. అయితే , తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ విష‌యంలో కొంత స‌డ‌లింపు ప్ర‌క‌టించింది.

ఈ క్ర‌మంలో కేంద్రం ఆదేశాల మేర‌కు ఎన్నారైలకు వెంటనే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్న‌ యూఐడీఏఐ ) ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. స్వదేశానికి వచ్చిన వెంటనే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే, దీనికి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం ఇండియన్ పాస్‌పోర్టు తప్పనిసరి అని పేర్కొంది. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ ఓ ట్వీట్ చేసింది. ఎన్నారైలు ఇకపై ఆధార్ దరఖాస్తు కోసం 182 రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. చెల్లుబాటయ్యే భారతీయ పాస్‌ పోర్టు ఉన్న ప్రవాస భారతీయులు స్వదేశానికి రాగానే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆధార్ అప్లై చేయాలి అంటే, మొదటగా సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. ఇతర వివరాల కోసం 1947 ఫోన్ చేయవచ్చు. లేదా help@uidai.gov.inకు మెయిల్ చేయండి” అంటూ యూఐడీఏఐ ట్వీట్ చేసింది. అలాగే , ప్రవాస భారతీయులు ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునే విధానం కూడా వివ‌రించింది.. అదేంటంటే.. మొదట సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. చెల్లుబాటు అయ్యే ఇండియన్ పాస్‌ పోర్టు తప్పనిసరి. ఆ తర్వాత నమోదు దరఖాస్తు ఫారంలో వివరాలు నింపాలి. ఎన్నారైలు ఈ-మెయిల్ ఐడీ ఇవ్వడం తప్పనిసరి. ఇక ప్రవాస భారతీయులకు డిక్లరేషన్ అనేది కొంచెం భిన్నంగా ఉంటుంది.

కాబట్టి, జాగ్రత్తగా చదివిన తర్వాత సైన్ చేయాలి. తనను ఎన్నారైగా నమోదు చేయాల్సిందిగా ఆపరేటర్‌ కి చెప్పాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా మీ పాస్‌ పోర్టు ఇవ్వాలి. బయోమెట్రిక్ క్యాప్చర్ ప్రాసెస్‌ ను కూడా జాగ్రత్తగా పూర్తి చేయాలి. 14 అంకెలతో ఉండే దరఖాస్తు స్లిప్‌ ను తీసుకోవాలి. ఈ స్లిప్‌ లో దరఖాస్తు ఐడీ, తేదీ, సమయం ఉంటాయి. ఇవి మీ దరఖాస్తు స్టేటస్‌ ను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. మొత్తంగా గత కొన్ని రోజులుగా ఓ పెద్ద సమస్య గా భావిస్తున్న ఎన్నారైలకు మోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది అనే చెప్పాలి.