Begin typing your search above and press return to search.

వ్యాక్సినేషన్ పై ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   31 Dec 2021 12:30 PM GMT
వ్యాక్సినేషన్ పై ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం
X
కరోనాను ఎదుర్కోడానికి వ్యాక్సిన్ ఒక్కటే శక్తివంతమైన ఆయుధం. ఈ విషయాన్ని ప్రపంచ దేశాల వైద్య నిపుణులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. జనాభాను బట్టి డోసులు నిర్ణయిస్తున్నాయి. మనదేశంలో రెండు డోసుల ప్రక్రియ కొనసాగుతుండగా... త్వరలో మూడో డోసు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం వ్యాక్సినేషన్ చాలా చురుగ్గా సాగుతోంది. ఆ దేశంలో త్వరలో నాలుగో డోసు ప్రక్రియను ప్రారంభించనున్నారు.

ఈ ఏడాది ఆగస్టు వరకే ఇజ్రాయెల్ లో దాదాపు అందరికీ మూడో డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది. అయితే వైరస్ ను ఎదుర్కోవడానికి బూస్టర్ డోసులు అవసరమని కొందరు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ లో టీకా పంపిణీ వేగవంతం చేశారు. అంతేకాకుండా నాలుగో డోసుకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. నాలుగో డోసుకు సిద్ధమైన తొలి దేశంగా ఇజ్రాయెల్ అవతరించింది. త్వరలో నాలుగో డోసును అక్కడి ప్రజలకు ఇవ్వనున్నారు.

నాలుగో డోసు పంపిణీ ప్రక్రియలో మొదటి దశలో కొందరినీ ఎంపిక చేసి... టీకా ఇవ్వనున్నారు. శారీరకంగా బలహీనంగా ఉన్నవారు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి ఈ డోసుకు మొదటి ప్రాధాన్యంగా ఇవ్వనున్నారు. అనంతరం పూర్తి ఆరోగ్యవంతులైన ప్రజలకు టీకా ఇస్తారు. అయితే ఈ ప్రక్రియను అతి త్వరలో పూర్తి చేస్తామని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇజ్రాయెల్ లో మొదటి నుంచే చురుగ్గా సాగుతోంది.

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఒమిక్రాన్ విస్తరిస్తుండగా నాలుగో డోసు పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వైద్య సిబ్బందిలో కొందరికి నాలుగో డోసు టీకాను ఇచ్చారు. వారిలో మెరుగైన ఫలితాలను గుర్తించారు. అందుకే దేశ ప్రజలందరికీ నాలుగో డోసు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ అతివేగంగా వ్యాప్తి చెందుతోంది. టీకా ద్వారా దీనిని అదుపు చేయవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. కాగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బూస్టర్ డోస్ కన్నా కనీసం రెండు డోసులను ప్రతి ఒక్కరికీ అందించాలని స్పందించింది. ఈ మేరకు బూస్టర్ డోస్ లు పెద్దగా అవసరం లేదని చెప్పడం గమనార్హం.