Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో డ్రగ్స్ కట్టడికి సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   7 Jan 2022 12:30 AM GMT
హైదరాబాద్ లో డ్రగ్స్ కట్టడికి సంచలన నిర్ణయం
X
గత సంవత్సర కాలంగా డ్రగ్స్ వ్యవహారం దడ పుట్టిస్తోంది. విచ్చలవిడిగా మత్తు పదార్థాలు సరఫరా కావడమే కాకుండా వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోయింది. దీంతో డ్రగ్స్ రవాణా చేసేవారిని పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఎక్కడికక్కడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా రోజూ ఎక్కడో చోట.. ఏదో ఒక రూపంలో డ్రగ్స్ లభ్యమవుతోంది. ముఖ్యంగా గంజాయి రవాణాపై ఫోకస్ పెట్టిన పోలీసులు ప్రత్యేకంగా నిఘా వేసి పట్టుకుంటున్నారు. అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న సీపీ ఆనంద్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి డ్రగ్స్ రవాణా చేసేవారినే కాకుండా దానిని వినియోగించేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇటీవల నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న మూడు గ్యాంగులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 20 లక్షల రూపాయల డ్రగ్స్ ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుకున్నవారిలో రెండు ముంబయ్ కి చెందివి కాగా.. మరొకరు హైదరాబాద్ కు చెందిన గ్యాంగ్ గా గుర్తించారు. అయితే వీరికి సూత్రధారులు మాత్రం నైజిరియాకు చెందిన వారే నని పోలీసులు తెలిపారు. కానీ అసలు సూత్రధారి కాకుండా ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

అయితే డ్రగ్స్ రవాణాపై ఎన్ని తనిఖీలు నిర్వహించినా ఎక్కడో చోట భారీగా లభ్యమవుతోంది. దీంతో మాదక ద్రవ్యాలను విక్రయించే వారికంటే వినియోగించేవారిపై చర్యలు తీసుకుంటే రవాణా ఆగిపోయే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఏ వస్తువైనా డిమాండ్ లేనప్పుడు దాని సప్లయ్ తగ్గుతుంది. అలాగే డ్రగ్స్ వినియోగించేవారిని కట్టడి చేస్తే సరఫరా చేసేవారు తగ్గుతారని అంటున్నారు. ఈనేపథ్యంలో డ్రగ్స్ వినియోగించేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకునే ఈ డ్రగ్స్ దందా సాగుతోంది. అయతే దీనిని వియోగించిన విద్యార్థులైనా సరే కఠిన చర్యలు తీసుకునే ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఇన్ని రోజులు వారి భవిష్యత్ గురించి ఆలోచించాల్సి వచ్చిందని, కానీ ఇక డ్రగ్స్ ను అరికట్టడానికి వారి భవిష్యత్ ను చూడాల్సిన అవసరం లేదని అన్నారు. దీనిని వినియోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే డ్రగ్స్ మాఫియా కొనుగోలు చేస్తున్న వారిపై 27 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయించారు. వినియోగదారులు కట్ చేస్తే సప్లయ్ దారులు ఉండరని పోలీసులు భావిస్తున్నారు.

అంతకుముందు డ్రగ్స్ రవాణాపై పోకస్ పెట్టి ఎక్కడికక్కడా తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. కానీ వీరికి అంతర్జాతీయంగా సంబంధాలు ఉండడంతో, విదేశాల నుంచి డ్రగ్స్ సరఫరా అవుతోంది. దీంతో డ్రగ్స్ ఎంత స్వాధీనం చేసుకున్నా మళ్లీ ఇతర వ్యక్తులతో సంబధాలు పెట్టుకొని డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ అమ్మేవారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వినియోగించేవారిపై కూడా కఠినంగా శిక్షిస్తే ఫలితం ఉంటుందని అనుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. మరోవైపు గంజాయ్ రవాణాపై ఎప్పటికప్పుడు నిఘా వేసి కంట్రోల్ చేస్తున్నారు. కానీ తాజాగా పోలీసులు తీసుకున్న నిర్ణయంపై మార్పులు ఉంటాయో..? లేదో..? చూడాలి