Begin typing your search above and press return to search.

సంచలనంగా మారిన రేణుకా చౌదరి సంతకం.. వారిలో ఆమె కూడా ఒకరా?

By:  Tupaki Desk   |   30 Aug 2020 2:30 PM GMT
సంచలనంగా మారిన రేణుకా చౌదరి సంతకం.. వారిలో ఆమె కూడా ఒకరా?
X
రాజకీయాల్లో శాశ్విత మిత్రులు.. శత్రువులు ఉండరు. కాలం అభిప్రాయాల్ని మార్చేస్తుంది. రాజకీయాల పై కాల మహిమ మరింత ఎక్కువ. అప్పటివరకు సన్నిహితులుగా ఉన్నోళ్లు కాస్తా.. ఆగర్భ శత్రవులుగా మార్చేయటం చూస్తుంటాం. చిన్న విషయాలు కాలంతో పాటు పెరిగి పెద్దవి అవుతుంటాయి. తాజాగా రేణుకా చౌదరి వ్యవహారం కూడా ఈ కోవలోకే వస్తుందని చెప్పాలి. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో పాటు.. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాంచి పట్టున్న నేతగా.. గాంధీ కుటుంబానికి వీర విధేయురాలిగా వ్యవహరించిన రేణుకా చౌదరి పేరు ఇప్పుడు కొత్త కలకలానికి కారణంగా మారింది.

గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది సీనియర్ నేతలు సంతకాలు పెట్టిన లేఖ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందులో ఇప్పటివరకుచాలా తక్కువ మంది పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరి కూడా సంతకం చేశారన్న విషయం బయటకు వచ్చింది. దీంతో.. తెలంగాణ పార్టీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి కారణం లేకపోలేదు. చాలా తక్కువమందికి మాత్రమే లభించే గాంధీ కుటుంబాలతో సాన్నిహిత్యం రేణుకాకు ఎక్కువనే చెప్పాలి.

ఆమె అధినేత్రి సోనియాకు వీర విధేయురాలిగా ఉండటాన్ని మర్చిపోలేదు. జన్ పథ్ లోకి నేరుగా వెళ్లగలిగే అవకాశం ఉన్న కొద్దిమంది నేతల్లో ఆమె ఒకరుగా చెబుతారు. అలాంటి ఆమె.. ఈ రోజున సీనియర్లు రాసిన లేఖపై సంతకం పెట్టటమా? అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిన్నటికి నిన్న టీ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.. గులాం నబీ అజాద్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

గాంధీ కటుుంబానికి బాసటగా నిలిచే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటివరకు మరో ఆలోచన లేని దానికి భిన్నంగా రేణుకా పేరు తెర మీదకు రావటంతో కొత్త సమీకరణాలు తెర తీసినట్లు అవుతుందని చెబుతున్నారు. గాంధీ కుటుంబంతో సన్నిహితురాలిగా వ్యవహరించిన రేణుకా.. ఈ రోజున సంతకం పెట్టటమా? అన్న సందేహం అందరి నోట వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ పగ్గాల్ని రాహుల్ గాంధీ చేపట్టిన తర్వాత టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రయత్నించారు.

ఆ సందర్భంగా ఆమెకు గులాం నబీ అజాద్ విపరీతంగా లాబీయింగ్ చేశారు. కానీ.. అవకాశం ఆమెకు దక్కకుండా ఉత్తమ్ కు ఇవ్వటం తెలిసిందే. దీనంతటికి కారణం రాహుల్ అన్న ఆగ్రహం రేణుకకు ఉందని చెబుతారు. అంతేకాదు.. తనకు రాజ్యసభకు సభ్యత్వాన్ని ఇచ్చే విషయంలోనూ అడ్డుపడటాన్ని తట్టుకోలేని ఆమె.. రాహుల్ కు వ్యతిరేకంగా సీనియర్లు రాసిన లేఖలో సంతకం పెట్టినట్లుగా భావిస్తున్నారు. 1999, 2004లో ఖమ్మం ఎంపీగా గెలిచిన ఆమె.. 2009లో ఓడారు. అనంతరం రాజ్యసభ సభ్యత్వాన్ని సొంతం చేసుకున్నారు. 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవటాన్ని వ్యతిరేకించిన నాటి నుంచి రాహుల్ ఆగ్రహానికి గురయ్యారని చెబుతారు.

ఇష్టం లేకున్నా.. ప్రచారం చేయటంతో పాటు.. తన మనసులోని బాధను దాచి పెట్టే ప్రయత్నం చేయలేదు. కీలకమైన ఎన్నికల వేళ.. తన ముందు రాహుల్ నిర్ణయానికి కట్టుబడటం తప్పించి మరో మార్గం లేదన్న ఆమె మాటలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఆ తర్వాత నుంచి పార్టీలో ఆమె ప్రాభవం తగ్గటం.. ప్రజల్లో ఆమె కనిపించకుండా పోవటం జరిగిపోయాయి. తాను పక్కకు వెళ్లటానికి కారణాల్లో రాహుల్ కీలకమని భావించే ఆమె.. తనకు తాజాగా లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలోనే సంతకం చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చన్న నానుడిలో నిజం ఎంతన్నది మరోసారి స్పష్టమైందని చెప్పక తప్పదు.