Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చారు.. వైసీపీ ఓక ఉగ్రవాద పార్టీ!

By:  Tupaki Desk   |   11 Jan 2022 11:41 AM GMT
ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చారు.. వైసీపీ ఓక ఉగ్రవాద పార్టీ!
X
గతానికి భిన్నంగా ఏపీ బీజేపీ నేతలు ఈ మధ్య కాలంలో తమ గళాన్ని సవరించుకుంటున్నారు. ఏపీ అధికారపక్షంపై విమర్శలు చేసే వేళలో.. ఆచితూచి అన్నట్లుగా వ్యాఖ్యలు చేసే వారే తప్పించి.. ఘాటైన పదాల్ని అంతగా వాడేవారు. ఆ కొరతను తీరుస్తూ.. ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు మించి వారు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.

తాజాగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మోతాదు తీరు ఎక్కువైందని చెప్పాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను ఆఫ్ఘనిస్తాన్ గా మార్చారని.. ఏపీని తాలిబన్లు పాలిస్తున్నట్లుగా వ్యాఖ్యానించిన వైనం రాజకీయాల్ని వేడెక్కేలా చేసింది. వైసీపీ ఒక ఉగ్రవాద పార్టీ అని.. శిక్షణ పొందిన తాలిబన్ల మాదిరి వారి వ్యవహారశైలి ఉందన్నారు. ఆంధ్రా తాలిబన్ల మాదిరి తయారయ్యారన్నారు. ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా అభివర్ణించారు.
ఇంతకీ ఈ బీజేపీ యువనేత విష్ణువర్దన్ రెడ్డి ఇంత తీవ్రంగా ఎందుకు విరుచుకుపడ్డారు? ఆయనకు ఇంత కోపం ఎందుకు? అన్నది ప్రశ్నలుగా మారాయి. వీటికి సమాధానం వెతికితే.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరులో వైసీపీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఆయనకు బీజేపీ నేతలకు మధ్య నడిచిన లడాయి గురించి తెలిసిందే.

ఇంతకీ ఆత్మకూర్ లో ఏం జరిగింది? అదో పెద్ద వివాదంగా మారటానికి కారణం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..
రెండు.. మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భౌతిక దాడుల వరకు వెళ్లాయి. ఇదంతా ఎందుకంటే.. అక్కడ నిర్మిస్తున్న మసీదుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మసీదును అక్రమంగా నిర్మిస్తున్నారని బీజేపీ నేత బుడ్డా కలుగజేసుకోవటంతో వివాదం పెరిగి పెద్దదైంది. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు బుడ్డాను వెనక్కి పంపారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి వాహనంపై మరో వర్గం వారు అడ్డుకోవటం.. వారి నుంచి తప్పించుకోవటానికి వాహనాన్ని వేగంగా నడపాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు కాగా.. ఒకరు మరణించినట్లుగా చెబుతున్నారు.

పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బుడ్డా శ్రీకాంతరెడ్డిపై దాడి జరగటం.. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు గాల్లోకి రెండురౌండ్లు కాల్పులు జరిపి..పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. తమపై దాడి చేయటం.. పోలీసుల సమక్షంలోనే వాహనాన్ని ధ్వంసం చేయటంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమపై దాడి చేసిన వారిపై హత్యానేరం కేసులు నమోదు చేయాలని.. బాధితులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

ఈ వ్యవహారం బీజేపీ.. వైసీపీల మధ్య మాటల యుద్దానికి కారణమైంది. తాజాగా బీజేపీనేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మకూర్ ఘటన బీజేపీ.. వైసీపీల మధ్య జరిగినదిగా అభివర్ణించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి తోడయ్యారన్నారు. వైసీపీ నేతల్ని కేసు నుంచి తప్పించేందుకుమత ఘర్షణలుగా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఉదంతంపై సీఎంజగన్మోహన్ రెడ్డి.. హోం మంత్రి సుచరిత సమాధానం చెప్పాలన్నారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ కు.. శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య జరిగిన చర్చల వివరాల్ని బయటకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆత్మకూరు ఘటన నేపథ్యంలో అక్కడకు వెళ్లిన టీడీపీ నేతల్ని అడ్డుకున్న వారు డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ ఖాన్.. హఫీజ్ ఖాన్ లను ఎందుకు పంపారు? అని ప్రశ్నించారు. వైసీపీ కేంద్రకార్యాలయం సూచనతో ఆత్మకూరులో దాడులు.. పోలీసుస్టేషన్ మీద దాడి.. వాహనాల్ని దగ్ధం చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఆత్మకూరులో దాడి జరిగింది ఒక వ్యవస్థ మీదనని.. పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవటంపై ముఖ్యమంత్రి.. హోం మంత్రి ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు.

గుంటూరులోనూ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే వైసీపీ ప్రభుత్వం కేసులు ఎత్తి వేసిందని.. ఆత్మకూరులోనూ కేసులు ఎత్తి వేస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారని.. ఐపీసీని వైసీపీగా మార్చేశారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అధికార దాహంతో రెచ్చిపోతున్నారని.. ఐపీఎస్ అధికారుల్ని సైతం అధికారపార్టీ నేతలు బెదిరిస్తున్నారన్నారు. వైసీపీకి అధికారం ఇదే తొలిసారి.. ఇదే చివరిసారి అని చెప్పారు. ఆత్మకూరు ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.. హఫీజ్ ఖాన్.. శిల్పా చక్రపాణి రెడ్డిలపై కేసులు నమోదు చేయకుంటే చలో ఆత్మకూరు పిలుపునిస్తామన్నారు. ప్రాణ భయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి మీద హత్య కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు.