Begin typing your search above and press return to search.

1000.. 830.. 1150.. 1500... 1625

By:  Tupaki Desk   |   24 Aug 2015 1:11 PM GMT
1000.. 830.. 1150.. 1500... 1625
X
7000000000000. ఈ అంకెను స‌రిగా చ‌ద‌వ‌టానికి క‌నీసం అర నిమిషం అయినా ప‌ట్ట‌టం ఖాయం. కానీ.. ఈ అంకె చేసిన క‌ల్లోలం భార‌త స్టాక్ మార్కెట్ ను ర‌క్త‌టేరుల‌తో ముంచెత్తింది. కాస్త అటూ ఇటూగా కేవ‌లం ఏడు గంట‌ల వ్య‌వ‌ధిలో ఏడు ల‌క్ష‌ల కోట్ల రూపాయిలు స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ భారీ ప‌త‌నం కార‌ణంగా న‌ష్ట‌పోయింది.

అంటే.. గంట‌కు ల‌క్ష కోట్ల రూపాయిల చొప్పున స్టాక్ మార్కెట్ న‌ష్ట‌పోయింది. చైనాలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీ కుదుపుకు లోన‌య్యాయి. ఇక‌..భార‌త్ సెన్సెక్స్ అయితే చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సునామీ వ‌స్తే స‌ముద్ర తీరం ఏ విధంగా అయితే వ‌ణికిపోతుందో.. దాదాపు అంత తీవ్ర‌త‌తో సెన్సెక్స్ వ‌ణికి పోయింది.

పాతాళానికి ప‌డిపోయిన సెన్సెక్స్ కార‌ణంగా సోమ‌వారం ఒక్కరోజులో స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 1625 పాయింట్ల‌ను న‌ష్ట‌పోయింది. నిఫ్టీ అయితే.. 490 పాయింట్లు న‌ష్ట‌పోయింది. సెన్సెక్స్ దారుణ ప‌త‌నంతో దాదాపుగా రూ.7ల‌క్ష‌ల కోట్ల రూపాయిల మ‌దుప‌రుల సొమ్ము ఆవిరైపోయింది. నిన్న‌టివ‌ర‌కూ కోట్లాది రూపాయిలుగా క‌నిపించిన కాగితాలు.. ఇప్పుడు చిత్తు కాగితాలుగా మారిపోయాయి.

తెలంగాణ‌.. ఏపీ రాష్ట్రాల వార్షిక బ‌డ్జెట్లు వ‌రుస‌గా మూడేళ్ల పాటు ఎంత మొత్త‌మైతే ఉంటుందో.. అంత మొత్తం సెన్సెక్స్ కార‌ణంగా కేవ‌లం ఏడు గంట‌ల వ్య‌వ‌ధిలో న‌ష్ట‌పోవ‌టం చూసిన‌ప్పుడు.. విధ్వంసం ఎంత భ‌యంక‌రంగా.. దారుణంగా ఉందో తెలుస్తుంది.

సోమ‌వారం సెన్సెక్స్ ప్రారంభమైన కాసేప‌టికే వెయ్యి పాయింట్లు కోల్పోయిన భారీ కుదుపున‌కు లోనైంది. అనంత‌రం కాస్త కోలుకొని 830 పాయింట్లు వ‌ద్ద‌కు చేరుకుంది. మ‌రోసారి భారీ కుదుపున‌కు లోనైన సెన్సెక్స్ 1150 పాయింట్ల‌కు ప‌డిపోయింది.

ఈ వ‌రుస న‌ష్టాల‌తో కుంగిపోయిన మార్కెట్ సెంటిమెంట్ త‌న‌కు స‌త్తువ లేన‌ట్లు ప‌డిపోతూనే ఉండిపోయింది. దీంతో.. 1150 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ త‌ర్వాత 1500ల‌కు దిగ‌జారి.. అంతిమంగా 1625 పాయింట్లు కోల్పోయి.. స్టాక్ మార్కెట్ మొత్తం ర‌క్త‌టేరులు పారేలా చేసింది. ఆ ర‌క్త వ‌ర‌ద‌తో ఏడు ల‌క్ష‌ల కోట్ల రూపాయిలు గాల్లో ఆవిరి అయిపోయాయి. దేశంలో విదేశీ మార‌క నిల్వ‌లు పుష్క‌లంగా ఉన్నాయ‌ని .. 380 బిలియ‌న్ డాల‌ర్ల మార‌కం ఉంద‌ని.. దేశ ఆర్థిక ప‌రిస్థితికి ఎలాంటి ఇబ్బంది లేద‌ని చెప్పినా సెన్సెక్స్ ప‌త‌నం మాత్రం ఆగ‌లేదు. మొత్తంగా భార‌త ఆర్థికచ‌రిత్ర‌లో మ‌ర్చిపోలేని బ్లాక్ మండేల‌లో ఒక‌టిగా ఆగ‌స్టు 24 నిలిచిపోవ‌టం ఖాయం.