Begin typing your search above and press return to search.

రికార్డు స్థాయిలో ప‌డిపోయిన‌ సెన్సెక్స్!

By:  Tupaki Desk   |   4 Oct 2018 9:19 AM GMT
రికార్డు స్థాయిలో ప‌డిపోయిన‌ సెన్సెక్స్!
X
కొద్ది రోజులుగా డాల‌ర్ తో రూపాయి మార‌కం విలువ ప‌త‌న‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఓ పక్క రూపాయి ప‌త‌నం....మ‌రోప‌క్క అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల‌....వంటి కార‌ణాల‌తో షేర్ మార్కెట్ అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. మ‌ధ్య‌లో ఐఎఫ్ అండ్ ఎల్ ఎస్ సంక్షోభం దీనికి తోడైంది. రాఫెల్ స్కాం ప్ర‌భావం చూపింది. మోడీ గెలుపుపై నీలినీడ‌లు ఏర్ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మార్కెట్ రివ‌ర్స్ గేరులో న‌డుస్తోంది. వ‌రుస‌గా న‌ష్టాల్లో ఉన్న సెన్సెక్స్ నిన్న 500 కు పైగా పాయింట్లు ప‌డిపోవ‌డంతో ఆగ‌లేదు. ఈరోజు తాజాగా 2008 ఏడాది త‌ర్వాత అంత వ‌రుస న‌ష్టాల‌ను చ‌విచూస్తోంది. ఈరోజు దలాల్‌ స్ట్రీట్‌ కుప్పకూలింది. గురువారం మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి సెన్సెక్స్‌ 805పాయింట్ల రికార్డు నష్టాన్ని చ‌విచూసింది. గ‌డ‌చిన ప‌దేళ్లలో సెన్సెక్స్ ఈ స్థాయిలో ప‌త‌నం కావ‌డం ఇదే తొలిసారి. గురువారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యానికి సెన్సెక్స్‌ 805పాయింట్ల న‌ష్టంతో 35170 పాయింట్ల వద్ద ఉంది. నిఫ్టీ 244 పాయింట్ల నష్టంతో 10614 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. దీంతో, షేర్ మార్కెట్లో విప‌రీత‌మైన భ‌యాందోళ‌న‌లు ఏర్ప‌డ్డాయి. మ‌దుప‌ర్లంతా టెన్ష‌న్ కు గుర‌వుతున్నారు.

గురువారం నాటికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74కు దగ్గరగా వెళ్తోంది. దీంతోపాటు ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆ ప్ర‌భావం షేర్ మార్కెట్ల పై ప‌డింది. మదుపర్లంతా అమ్మకాలకు మొగ్గు చూప‌డంతో నేడు సెన్సెక్స్‌ ఆరంభం నుంచి న‌ష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఈ రోజు ఉద‌యం సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ ఆరంభించింది. ఆ న‌ష్టాల ప‌రంప‌ర కొన‌సాగుతూ మధ్యాహ్నం 12 గంట‌ల‌ సమయానికి సెన్సెక్స్‌ 805పాయింట్లు - నిఫ్టీ 244 పాయింట్లు న‌ష్ట‌పోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.74 వద్ద ట్రేడవుతోంది. ప్ర‌స్తుతానికి ట్రేడింగ్ కొన‌సాగుతోంది. ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి న‌ష్టం ఏ స్థాయిలో ఉంటుందోన‌ని మ‌దుప‌ర్లంతా తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.