Begin typing your search above and press return to search.

ఆయన నోటి మాటతో వేల కోట్లు ఆవిరయ్యాయా?

By:  Tupaki Desk   |   18 Sep 2019 5:45 AM GMT
ఆయన నోటి మాటతో వేల కోట్లు ఆవిరయ్యాయా?
X
నోట్లో నుంచి వచ్చే ఒక్క మాట చాలు రచ్చ చేస్తుంది. మాట జారితే జరిగే నష్టం అంతా ఇంతా అన్నట్లు ఉండదు. అందునా కీలక స్థానాల్లో ఉండే వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటా కౌంట్ అన్నట్లు ఉంటుంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల వేళ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) గవర్నర్ లాంటి స్థానంలో ఉండే వారి నోటి మాటకు సెనెక్స్ ఎంతలా ప్రభావితం అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

చమురు సంక్షోభంతో ఇప్పటికే తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వేళ.. ఆర్ బీఐ గవర్నర్ నోటి వెంట వచ్చిన మాట మరింత భయాందోళనలకు మార్కెట్ గురయ్యేలా చేయమే కాదు.. పెద్ద ఎత్తున నష్టాలకు కారణమైందని అంటున్నారు. గల్ఫ్ లో యుద్ధమేఘాలు కమ్ముకోవటం.. చమురు ప్రొడక్షన్ తగ్గిన వేళ.. ఇప్పటికే ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. ముంచుకొస్తున్న మాంద్యం ఒకవేళ భయపెడుతుంటే.. మరోవైపు గల్ఫ్ సంక్షోభంతో మార్కెట్లు చిగురుటాకులా వణుకుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యిందని చెప్పాలి. చమురు ధరలు పెరిగితే కరెంట్ అకౌంట్ లోటు.. ద్రవ్యోలోటు మరింత అధ్వానమవుతాయని ఆయన చెప్పిన మాటలు మార్కెట్ల మీద తీవ్రప్రభావాన్ని చూపటమే కాదు.. భారీ నష్టాలకుకారణమైందని చెబుతున్నారు. దేశంలో వినియోగించే చమురులో 80 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్నదే. ఇలాంటివేళ.. చమురుధరలు పెరిగితే ఆ ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితి మీద తీవ్రంగా ఉండటం ఖాయం.

చమురు సంక్షోభం.. ఆర్ బీఐ గవర్నర్ నోటి నుంచి వచ్చిన మాటలు.. ఇతర అంతర్జాతీయ పరిణామాలు కలిపి ఒక్క మంగళవారం స్టాక్ మార్కెట్ దారుణమైన అనుభవం ఎదురైంది. రూ.2.38 లక్షల కోట్ల సంపద క్షీణించింది. నాలుగైదు షేర్లు తప్పించి.. మిగిలినవన్నీ నష్టాల బాట పట్టాయి. అన్నింటికి మించిన ఆందోళన కలిగిస్తున్న అంశం డెత్ క్రాస్ లో నిఫ్టీ. ఇంతకీ డెత్ క్రాస్ అంటే.. సాధారణంగా 50 రోజుల మూవింగ్ యావరేజ్ ను స్వల్పకాలిక మూవింగ్ యావరేజ్ గా చెబుతారు. దీర్ఘకాలిక మూవింగ్ యావరేజ్ ను 200 రోజులకు తీసుకుంటారు. దీర్ఘకాలిక మూవింగ్ యావరేజ్ కంటే దిగువకు పడిపోవటాన్ని డెత్ క్రాస్ గా చెబుతారు.

నిఫ్టీ సూచిక బలహీనత చూస్తున్నప్పుడు డెత్ క్రాస్ ఒక సంకేతంగా మారింది. అంతేకాదు.. మరింత పతనం అయ్యే అవకాశం ఉందంటున్నారు. నిఫ్టీ మంగళవారం 186 పాయింట్లు పతనమై.. 10,818 పాయింట్ల వద్దకు చేరింది. గడిచిన రెండు రోజుల్లో నిఫ్టీ ఏకంగా 258 పాయింట్లు నష్టపోవటం గమనార్హం.