Begin typing your search above and press return to search.

మోడీ యావ‌రేజ్ - ఆల్ స్టాక్స్ డ‌మాల్‌

By:  Tupaki Desk   |   18 Dec 2017 5:39 AM GMT
మోడీ యావ‌రేజ్ - ఆల్ స్టాక్స్ డ‌మాల్‌
X
దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ప‌లితాలు వెలువ‌డుతున్నాయి. ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు షురూ అయిన కాసేప‌టికే ట్రెండ్ బ‌య‌ట‌కు రావ‌టం.. ఊహంచ‌ని రీతిలో బీజేపీకి ఎదురుదెబ్బ త‌గ‌ల‌టం.. కాంగ్రెస్ పుంజుకోవ‌టం స్టాక్ మార్కెట్‌ను వ‌ణికించింది. టెక్నిక‌ల్ గా బీజేపీ విజ‌యం ఖ‌రారైనా.. మోడీ సొంత అడ్డాలో వ‌స్తున్న ఫ‌లితాలు మోడీ స‌ర్కారు మీద అసంతృప్తిని చెప్ప‌క‌నే చెబుతున్నాయి.

గుజ‌రాత్.. హిమాచ‌ల్ రాష్ట్రాల అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు బీజేపీకి ఆశించినంత బాగా రాక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. గుజ‌రాత్ లో బీజేపీ అధిక్యం భారీగా త‌గ్గ‌టంతో దాని ప్ర‌భావం దేశీయ స్టాక్ మార్కెట్ మీద ప‌డింది.

జ‌లుబుకే వ‌ణికిపోయే స్టాక్ మార్కెట్‌.. గుజ‌రాత్ లో మోడీ హ‌వా త‌గ్గింద‌న్న ఫ‌లితాల స‌ర‌ళితో మార్కెట్లు తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యాయి. సోమ‌వారం ట్రేడింగ్ మొద‌లైన కాసేప‌టికి కీల‌క సూచీ అయిన సెన్సెక్స్ 765 పాయింట్లు ప‌త‌న‌మైంది.

నిఫ్టీ సైతం 10 వేల మార్క్‌ను కోల్పోతుందా? అన్న ఆందోళ‌న‌కు గురి చేసింది. అన్ని సెక్టార్లు న‌ష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఓట‌మిని కాంగ్రెస్ ముంద‌స్తుగానే అంచ‌నా వేసిన‌ప్ప‌టికీ.. గుజ‌రాత్ లో ఫ‌లితం అనూహ్యంగా ఉండ‌టం.. ఊహించిన దాని కంటే ఎక్కువ‌గా పుంజుకోవ‌టంతో స్టాక్ మార్కెట్ తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌వుతోంది.

ఇక‌.. గుజ‌రాత్ ఆధారిత షేర్లు పెద్ద ఎత్తున ప‌త‌న‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం 675 పాయింట్లు సెన్సెక్స్ న‌ష్టంతో ట్రేడ్ అవుతుండ‌గా.. నిఫ్టీ 208 పాయింట్ల న‌ష్టంతో ట్రేడింగ్ కొన‌సాగుతోంది. తాజా ప‌రిణామాల‌తో అటు ఇన్వెస్ట‌ర్లు.. ట్రేడ‌ర్లు ఒక్క‌సారిగా అమ్మ‌కాల‌కు దిగ‌టంతో సెన్సెక్స్ సూచీ దారుణంగా దెబ్బ తింటోంది. సెన్సెక్స్ 675 పాయింట్లు కోల్పోవ‌టం అంటే.. ఇంచుమించు రూ.2ల‌క్ష‌ల కోట్ల మ‌దుప‌రుల సంప‌ద ఆవిరి అయిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. ఈ మొత్తం ఎప్ప‌టికి రిక‌వ‌రీ అవుతుందో చూడాలి.