Begin typing your search above and press return to search.

విజ‌య‌మ్మ విసిరిన సెంటిమెంటు బాణం.. ఏం జ‌రుగుతుంది..?

By:  Tupaki Desk   |   1 Sep 2021 4:30 AM GMT
విజ‌య‌మ్మ విసిరిన సెంటిమెంటు బాణం.. ఏం జ‌రుగుతుంది..?
X
వైఎస్ జీవిత భాగ‌స్వామి, వైసీపీ గౌరవ అధ్య‌క్షురాలు.. వైఎస్ విజ‌య‌మ్మ‌.. విసిరిన సెంటిమెంట్ బాణం.. రెండు రాష్ట్రాల్లోని కీల‌క నేత‌ల‌ను తీవ్ర‌స్థాయిలో ఇబ్బంది పెడుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వైఎస్ జ‌మానాలో ఆయ‌న హ‌యాంలో మంత్రులుగా ప‌నిచేసిన వారు ఇత‌ర ప‌ద‌వులు పొందిన వారు వంద‌ల సంఖ్య‌లోనే ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వీరంతా అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ.. వైఎస్‌ను పొగుడుతున్నా.. దానిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే క్ర‌మంలోనే కామెంట్లు చేశారు. కానీ, ఇప్పుడు ఒకే వేదిక‌పైకి చేర్చి.. వారంద‌రితోనూ వైఎస్‌కు నివాళులు అర్పించాల‌నేది విజ‌యమ్మ ప్లాన్‌గా ఉంది.

ఈ క్ర‌మంలో విజ‌య‌మ్మ‌.. ఇప్పుడు పార్టీల‌కు అతీతంగా.. (అంటే.. గ‌తంలో వైఎస్ జ‌మానాలో ప‌నిచేసిన వారు.. ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. కొంద‌రు కాంగ్రెస్‌లోనే ఉన్నారు) ఆహ్వానించారు. వీరిలో తుల‌సిరెడ్డి(కాంగ్రెస్‌), కిర‌ణ్‌కుమార్‌రెడ్డి(మాజీ సీఎం, కాంగ్రెస్‌), ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్(త‌ట‌స్థం), మ‌ల్లాది విష్ణు(వైసీపీ), పితాని స‌త్య‌నారాయ‌ణ‌(టీడీపీ), మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి(వైసీపీ), ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి(వైసీపీ), స‌బితా ఇంద్రారెడ్డి(టీఆర్ ఎస్‌), ధ‌ర్మ‌పురి శ్రీనివాస్‌(టీఆర్ ఎస్‌), కే కేశ‌వ‌రావు(టీఆర్ ఎస్‌), దానం నాగేంద‌ర్‌(టీఆర్ ఎస్‌), పినిపే విశ్వ‌రూప్‌(వైసీపీ), పిల్లి సుభాశ్ చంద్ర‌బోస్‌(వైసీపీ).. ఇలా చాలా మంది నాయ‌కులకు విజ‌య‌మ్మ ఆహ్వానాలు పంపారు.

ఈ క్ర‌మంలో స‌భ‌కు వెళ్లాలా? వ‌ద్దా? అనే అంశంపై వీరు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. వెళ్తే.. వైసీపీ నాయ‌కుల‌కు ఇబ్బంది లేక పోవ‌చ్చు. కానీ, ఆ వేదిక‌గా.. వైఎస్‌ను పొగిడి.. జ‌గ‌న్‌ను పొగ‌డ‌క పోతే.. జ‌గన్ ద‌గ్గ‌ర ప‌లున అయిపోవ‌డం ఖాయం. అలాని .. వెళ్ల‌క‌పోతే.. వైఎస్ పెట్టిన రాజ‌కీయ భిక్ష‌తో ఎదిగి.. ఇప్పుడు ఆయ‌న కార్య‌క్ర‌మానికి పిలిస్తే.. రాలేద‌నే యాంటీ ప్ర‌చారం జ‌రిగితే.. ఏం జ‌రుగుతుంది? అనేది కీల‌కంగా మారింది. ఇక‌, టీఆర్ ఎస్‌లోనూ ఇదే త‌ర‌హా ఆలోచ‌న మ‌రో రూపంలో ఉంది. టీఆర్ ఎస్ ఇటీవ‌ల కాలంలో వైఎస్‌ను ద్రోహిగా చిత్రీక‌రించింది. ఇలాంటి స‌మ‌యంలో విజ‌య‌మ్మ స‌భ‌కు వెళ్లి ఏం చెప్పాలి? వైఎస్‌ను పొగ‌డాలా? అనేది వీరి అంత‌ర్మ‌థ‌నం.

ఇదే జ‌రిగితే.. ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ ఎస్ ద్రోహిగా చిత్రీక‌రించిన నాయ‌కుడిని తాము పొగిడితే.. కేసీఆర్ ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అవుతారు. సో.. వెళ్ల‌క‌పోతే..రేపు విజ‌య‌మ్మ మీడియా ముందుకు వ‌చ్చి.. త‌మ‌ను దోషులుగా చిత్రీక‌రించే ప్ర‌మాదం ఉంది. ప్ర‌జ‌లు కూడా.. దీనిని సెంటిమెంటు రూపంలో అర్ధం చేసుకునే అవ‌కాశం కూడా ఉంది. ఇలా మొత్తానికి వైసీపీ నుంచి టీఆర్ ఎస్ వ‌ర‌కు.. టీడీపీ స‌హా నాయ‌కులు విజ‌య‌మ్మ విసిరిన సెంటిమెంటుతో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.