Begin typing your search above and press return to search.

రూ.10ల‌కే ఎయిర్ పోర్టుల్లో టీ.. కాఫీ!

By:  Tupaki Desk   |   9 Sep 2018 4:41 AM GMT
రూ.10ల‌కే ఎయిర్ పోర్టుల్లో టీ.. కాఫీ!
X
సంప‌న్నులు.. ప్ర‌ముఖులు.. సెల‌బ్రిటీలు. కొన్ని వ‌ర్గాల‌కు మాత్ర‌మే ఎయిర్ పోర్టులు ప‌రిమితమ‌న్న భావ‌న చెరిగిపోయి చాలా కాల‌మే అయ్యింది. ఇటీవ‌ల కాలంలో విమానాశ్ర‌యాల‌కు వెళుతున్న వారిలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. దీంతో.. చాలా విమానాశ్ర‌యాలు కిట‌కిట‌లాడుతున్న ప‌రిస్థితి.

చౌక‌ధ‌ర‌ల‌కు విమాన టికెట్లు అందుబాటులోకి రావ‌టంతో ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో అన్ని వ‌ర్గాల వారు విమానాశ్రయాలకు వ‌స్తున్న వైనం అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇలాంటి వేళ‌.. అక్క‌డి ఫుడ్ ఐటెమ్స్ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉంటున్నాయి. కాఫీ.. టీ లాంటివి సైతం భారీ ధ‌ర‌ల‌కు వ‌సూళ్లు చేస్తున్నారు.

బ‌హిరంగ మార్కెట్ల‌తో పోలిస్తే.. టీ.. కాఫీ.. వాట‌ర్ బాటిల్స్ లాంటి వ‌స్తువుల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉంటున్నాయి. ఈ అంశంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌స్తున్న నేప‌థ్యంలో కేంద్ర స‌ర్కారు తాజాగా స్పందించింది. ప‌లువురు ప్ర‌యాణికుల నుంచి వ‌స్తున్న సూచ‌న‌ల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న భార‌త విమాన‌యాన ప్రాధికార సంస్థ ఎయిర్ పోర్టుల్లో త‌క్కువ ధ‌ర‌ల‌కే ఆహార‌ప‌దార్థాలు అందుబాటులోకి తేవాల‌న్న ఆలోచ‌న చేస్తున్నారు.

దీనికి సంబంధించిన కౌంట‌ర్ల‌ను త్వ‌ర‌లో ఎయిర్ పోర్టుల్లో ఏర్పాటు చేయ‌నున్నారు. టీ.. కాఫీ లాంటివి రూ.10ల‌కే ల‌భించేలా.. స‌మోసా.. వాట‌ర్ బాటిల్స్ లాంటి వాటి ధ‌ర‌ల్ని అందుబాటులో ఉండేలా చేయాల‌ని భావిస్తున్నారు. ధ‌ర‌లు త‌గ్గించార‌ని నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా చిరుతిళ్ల‌ను సాధార‌ణ రేట్ల‌కు అమ్మేలా స్టాల్స్ ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నాలు షురూ అయ్యాయి.

ఎయిర్ పోర్టుల్లో ఫుడ్ కోర్టులు నిర్విస్తున్న సంస్థ‌లు తాము విక్ర‌యించే శాండ్ విచ్ లు.. నీళ్ల సీసాలు ఎమ్మార్పీ ధ‌ర‌ల‌కే అమ్మాయిల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెబుతున్నారు. అయితే.. ఈ నిర్ణ‌యం కేవ‌లం ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న 90 విమానాశ్ర‌యాల్లో మాత్ర‌మే అమ‌లు చేయ‌నున్నారు. హైద‌రాబాద్‌.. బెంగ‌ళూరు.. ముంబ‌యి.. ఢిల్లీ త‌దిత‌ర ప్రైవేటు సంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌లో న‌డిచే ఎయిర్ పోర్టుల‌లో మాత్రం ఈ విధానం అమ‌లు కాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.