Begin typing your search above and press return to search.

హై అల‌ర్ట్ః ఆగ్రాలో వ‌రుస బాంబు పేలుళ్లు

By:  Tupaki Desk   |   18 March 2017 9:59 AM
హై అల‌ర్ట్ః ఆగ్రాలో వ‌రుస బాంబు పేలుళ్లు
X
భార‌త భ‌ద్ర‌త ద‌ళాల అంచ‌నా నిజ‌మైంది. ఆగ్రాలో బాంబు పేలుళ్ల‌కు అవ‌కాశం ఉంద‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఊహ నిజ‌మైన‌ట్లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఇవాళ రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆగ్రాలోని కంటోన్మెంట్ రైల్వే స్టేష‌న్ ప్రాంతంలో ఈ పేలుళ్లు జ‌రిగాయి. పేలుళ్ల వ‌ల్ల ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది. ర‌సూల్‌ పురాలో ప్లంబ‌ర్‌ గా ప‌నిచేస్తున్న అశోక్ అనే వ్య‌క్తి ఇంట్లో ఉద‌యం 5 గంట‌ల‌కు మొద‌టి పేలుడు జ‌రిగింది. మ‌రో 45 నిమిషాల త‌ర్వాత కంటోన్మెంట్ ఫ్లాట్‌ ఫామ్ 5వ నెంబ‌ర్ వ‌ద్ద ఉన్న చెత్త కుప్ప‌లో మ‌రో పేలుడు జ‌రిగింది. అయితే పేలుళ్ల‌కు సంబంధించి పూర్తి విచార‌ణ చేపట్ట‌నున్న‌ట్లు డీజీపీ మ‌హేశ్ కుమార్ మిశ్రా తెలిపారు.

ఆగ్రాలో ఉగ్ర దాడులు జ‌రిగే అవ‌కాశాలున్న‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అండ‌మాన్ ఎక్స్‌ ప్రెస్ ను ప‌ట్టాలు త‌ప్పించేందుకు ప్ర‌ణాళిక‌లు వేసిన‌ట్లు కూడా వ‌దంతులు వ‌చ్చాయి. దీంతో అక్క‌డ అంతా అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. ఇదే స‌మ‌యంలో తాజ్‌ మ‌హ‌ల్ వ‌ద్ద కూడా భ‌ద్ర‌త పెంచారు. ఎల్ల‌ప్ప‌డు ఉండే భ‌ద్ర‌త కంటే మరో మూడు రెట్లు పెంచారు. కొన్ని రోజుల క్రితమే లక్నోలో ఐసిస్‌ ఉగ్రవాదిగా భావిస్తున్న సైఫుల్లను ఎన్‌ కౌంటర్‌ లో పోలీసులు హతమార్చారు. ఈ ప‌రిణామంతో ఐసిస్‌ ఉగ్రవాదులు భారత్‌ లో భారీగా విధ్వంసానికి పాల్పడవచ్చన్న సమాచారం వ‌చ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. తాజ్‌ కట్టడానికి నాలుగు వైపుల బలగాలను మొహరించారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇలా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉన్న నేప‌థ్యంలో తాజ్ వ‌ద్ద కాకుండా ఆగ్రాలోని ఇత‌ర చోట్ల పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/