Begin typing your search above and press return to search.

కేశినేని నాని కి తీవ్ర అవమానం.. విభేదాలు తొలిగిపోలేదా?

By:  Tupaki Desk   |   8 March 2021 5:34 AM GMT
కేశినేని నాని కి తీవ్ర అవమానం.. విభేదాలు తొలిగిపోలేదా?
X
బెజవాడ టీడీపీలో విభేదాలు ఇంకా తొలిగిపోలేదా? నివురుగప్పిన నిప్పులా ఉన్నాయా? చంద్రబాబు, అచ్చెన్నాయుడు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయా? విజయవాడ ఎంపీ కేశినేని నాని వర్సెస్ టీడీపీ అసమ్మతి నేతల యుద్ధంలో కేశినేని నానికి తీవ్ర పరాభావం ఎదురైందా? అంటే ఔననే అంటున్నాయి విజయవాడ వర్గాలు.

ఎందుకంటే తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని ఏకంగా చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ కేశినేని తన కూతురు, విజయవాడ మేయర్ అభ్యర్థి శ్వేత కోసం అసమ్మతి నేతల హెచ్చరికలకు తలొగ్గాడని.. అందుకే చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉన్నారన్న చర్చ సాగుతోంది. ఇది కేశినేనికి ఘోర అవమానంగా ఆయన అనుచరులు రగిలిపోతున్నారు.

ఎంపీ కేశినేని నాని వర్సెస్ టీడీపీ సీనియర్లు బోండా ఉమా, బుద్దావెంకన్న, నాగుల్ మీరాల మధ్య సాగిన వార్ కు చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టారని వార్తలు వచ్చాయి. కానీ అదే జరిగితే నాని సహా టీడీపీ సీనియర్లు అంతా చంద్రబాబు పర్యటనలో కనిపించాలి. కానీ అటు నాని రాలేదు.. ఒక్క బుద్దవెంకన్న మాత్రమే హాజరయ్యారు. మిగతా వారు రాలేదు. దీంతో టీడీపీ మీడియా కప్పేసిన విభేదాలు సమసిపోలేదని తెలిసిపోయింది. చంద్రబాబు రంగంలోకి దిగి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనార్ధన్, వర్ల రామయ్యలతో కలిసి నేతలను బుజ్జగించిన ప్రయత్నాలు నెరవేరలేదని అర్థమైంది.

విజయవాడ కార్పొరేషన్ లో కార్పొరేటర్ సీట్లను టీడీపీ ఎంపీ కేశినేని నాని పంచడం.. మేయర్ గా తన కుమార్తెను ప్రకటించడంపై టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దావెంకన్న, నాగుల్ మీరాల వ్యతిరేకించారు. తాము సహకరించమని.. అసమ్మతి రాజేశారు. చంద్రబాబు కావాలో.. కేశినేని నాని కావాలో తేల్చుకోవాలని ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకే సవాల్ చేశారు. కేశినేని నానికి దమ్ముంటే ఇండిపెండెంట్ గా పోటీచేయాలని సవాల్ చేశారు.

ఇక టీడీపీ నేతలు సవాల్ చేయడంతో దీనిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశించిన మరుక్షణం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. తనపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. రేపు చంద్రబాబు పర్యటనకు సంబంధించి తాను రూట్ మ్యాప్ మార్చినట్టు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని నాని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వమే కలిసి కార్పొరేటర్లకు సీట్లు పంచారని.. తనపై నేతలు చేసిన విమర్శలు సరికాదని హితవు పలికారు.

ఇలా టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దావెంకన్న, నాగుల్ మీరాలు ఓవైపు.. ఎంపీ కేశినేని ఒకవైపు మాటల తూటాలు పేల్చడంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. వెంటనే రాష్ట్ర నేతలను పంపి చర్చించారు. మేయర్ కేశినేని శ్వేతకు మద్దతు ఇచ్చేలా అసమ్మతి నేతలను ఒప్పించారు.ఈ క్రమంలోనే టీడీపీ మేయర్ అభ్యర్థి శ్వేత స్వయంగా బోండా ఉమా ఇంటికి వెళ్లారు. తనకు సహకరించాల్సిందిగా బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలను కోరారు.

అయితే కేశినేని నాని చంద్రబాబుతో కలిసి విజయవాడలో ప్రచారం చేస్తే తాము రామని.. సహకరించమని అసమ్మతి నేతలు హెచ్చరించారు. వారి హెచ్చరికలకు తలొగ్గి ఎంపీ కేశినేని ప్రచారంలో చంద్రబాబుతో పాల్గొనలేదు. ఇటు అసమ్మతి నేతల్లో ఒక్కరే వచ్చారు. దీంతో విజయవాడ టీడీపీలో విభేదాలు సమసిపోలేదని తేలిపోయింది.