Begin typing your search above and press return to search.

అమెజాన్ కు `అలెక్సా` ఎఫెక్ట్‌: ఆడ‌పిల్ల‌ల తండ్రులే ఏమంటున్నారంటే!

By:  Tupaki Desk   |   7 July 2021 11:30 PM GMT
అమెజాన్ కు `అలెక్సా` ఎఫెక్ట్‌: ఆడ‌పిల్ల‌ల తండ్రులే ఏమంటున్నారంటే!
X
``అలెక్సీ ప్లీజ్ ప్లే ఓల్డ్ సాంగ్స్‌``.... అమెజాన్ ఎకో, ఎకో డాట్ స్పీకర్లను ఉద్దేశించి వినియోగ‌దారులు ప‌లికే మాట‌లు ఇవి. వీటిలో ప్ర‌తి దానిలోనూ `అలెక్సా` అనే పేరు ఉంది. వాయిస్ కమాండ్‌గా అలెక్సా అనే మాటను విరివిగా ఉపయోగిస్తున్నారు. అమెజాన్ ఎకో, ఎకో డాట్ స్పీకర్లకు సంకేతాలు, సూచనలు ఇవ్వడానికి, ప్రశ్నలు అడగటానికి అలెక్సా అనే పేరును ఉపయోగిస్తున్నారు. అయితే అలెక్సా పేరున్న వ్యక్తులకు దీనితో సమస్యలు ఎదురవుతున్నాయట. అలెక్సా అనే పేరుతో జోకులు వేసుకోవడం, సరదాగా కమాండ్లు ఇస్తుండటంతో ఆ పేరున్న వారికి అది ఇబ్బందిగా మారుతోంది.

ఇదీ .. స‌మ‌స్య‌..!

తన టీనేజ్ కూతురు స్కూల్‌కు వెళుతోందని, అలెక్సా అని పేరు పెట్టడం ఆమెకు సమస్యగా మారిందని బ్రిట‌న్‌కు చెందిన‌ హీథర్ అనే మహిళ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తోటి పిల్లలే కాకుండా స్కూల్ టీచర్‌ కూడా తన కూతురు పేరు మీద జోక్స్ వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ''అందరూ ఎగతాళి చేస్తున్నారని ఆమె తన పేరు చెప్పుకోవడం కూడా మానేసింది. కొంతమంది పెద్దవాళ్లు కూడా ఆమెపై జోకులు వేస్తున్నారు. ఇది ఆమెను మరింత ఇబ్బంది పెడుతోంది'' అన్నారు హీథర్. ఇది ఒక్క హీథ‌ర్ స‌మ‌స్య మాత్ర‌మే కాదు. అమెజాన్‌ సంస్థ వర్చువల్ అసిస్టెంట్ అలెక్సా కారణంగా తమ పిల్లలు అవహేళనకు, ఎగతాళికి గురవుతున్నారని అనేక మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్రిట‌న్ నుంచి అమెరికా వ‌ర‌కు.. దీంతో ఇప్పటికే చాలామంది పేరెంట్స్‌ తమ పిల్లల పేర్లు మార్చుకోగా, కొందరు మాత్రం అలెక్సా అనే పేరును మార్చాలని అమెజాన్‌ను డిమాండ్ చేస్తున్నారు. 2014 సంవత్సరంలో అలెక్సా ప్రారంభమైన తర్వాత ఈ సమస్య ఒక్క బ్రిట‌న్‌కే పరిమితం కాలేదు. అమెరికాలోని మసాచుసెట్స్ వ‌ర‌కు వెళ్లింది. అలెక్సా అనే పేరు మనిషిని అవమానించడానికి, హీనంగా చూడటానికి లైసెన్స్‌గా మారింది అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న వారు పెరుగుతున్నారు.

అమెజాన్ ఏమంది!

`అలెక్సా` స‌మ‌స్య‌పై అమెజాన్ స్పందించింది. అలెక్సాకు ప్రత్యామ్నాయంగా అనేక పేర్లను సూచించిన‌ట్టు పేర్కొంది. యూజర్లు అందులోని ఎకో, కంప్యూటర్, అమెజాన్‌లాంటి పేర్లను వాడుకోవచ్చు అని అమెజాన్ తెలిపింది. కానీ, ప్ర‌చార యాడ్స్‌లో మాత్రం అలెక్సా అనేపేరుతోనే పిలుస్తుండ‌డంతో మిగిలిన పేర్లు.. పెద్ద‌గా ప్ర‌చారంలోకి రాలేదు. దీంతో అలెక్సా పేరు స్థిర‌ప‌డిపోయింది. ఇదే ఇప్పుడు అమెరికా, బ్రిట‌న్ స‌మా.. జ‌పాన్‌లోనూ స‌మ‌స్య‌ల‌కు కార‌ణంగా మారిందని అంటున్నారు ప‌రిశీల‌కులు.