Begin typing your search above and press return to search.

భార‌త్‌లో వ్యాక్సిన్‌పై చిగురిస్తున్న ఆశ‌లు: ‌ఫేజ్ 1 స‌క్సెస్‌

By:  Tupaki Desk   |   21 July 2020 11:09 AM GMT
భార‌త్‌లో వ్యాక్సిన్‌పై చిగురిస్తున్న ఆశ‌లు: ‌ఫేజ్ 1 స‌క్సెస్‌
X
ప్రాణాంత‌కంగా మారి మాన‌వ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డలాడిస్తున్న మ‌హ‌మ్మారి వైర‌స్‌కు ఇక చ‌ర‌మ‌గీతం పాడాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ప్ర‌స్తుతం దేశంలో సామూహిక వ్యాప్తి మొద‌ల‌వ‌డంతో ప్ర‌జ‌లు దిన‌దిన గండంగా జీవిస్తున్నారు. అయితే ప్ర‌జలంద‌రినీ కాపాడేందుకు వైద్యులు..శాస్త్ర‌వేత్త‌లు అహోరాత్రులు క‌ష్ట‌ప‌డి ఆ వైర‌స్‌కు విరుగుడు క‌నిపెడుతున్నారు. దాదాపు ప‌ది సంస్థ‌లు ఆ వైర‌స్‌కు విరుగుడు క‌నిపెట్టే ప‌నిలో తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆస్ట్రాజెనెకా అండ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఆశాజ‌న‌కంగా క‌నిపిస్తోంది. వైర‌స్ విరుగుడుకు ఈ మందును త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఈ మందుపై తాజాగా ఓ శుభ‌వార్త వినిపించింది. ప్ర‌స్తుతం ఈ మందు ప్ర‌యోగ ద‌శ‌లో ఉంది. ఈ క్ర‌మంలో ఫేజ్-1 ప్ర‌యోగాలు చేశారు. దీని ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయ‌ని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించింది. దీనిపై ఆ సంస్థ సీఈఓ పూనావాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో సత్ఫలితాలనిస్తే 300 నుంచి 400 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ ఉత్పత్తికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ సంద‌ర్భంగా పూనావాల ప్రకటించారు. డిసెంబర్ వ‌ర‌కు 300 డోసులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్ ధర రూ.వెయ్యి వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఫేజ్-1 ట్రయల్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని.. భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం తాము మరో వారంలో అనుమతి కోరతామని వివ‌రించారు. అనుమతి లభిస్తే త్వరలోనే ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ సురక్షితంగా ఉంటుందని.. హ‌డావుడిగా తయారుచేసి వ్యాక్సిన్‌ను తీసుకొచ్చే ఆలోచన లేదని స్ప‌ష్టం చేశారు. మందు తీసుకురావ‌డం ఆలస్యమైనా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షిత వ్యాక్సిన్‌నే తీసుకువ‌స్తామ‌ని సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించింది.