Begin typing your search above and press return to search.

క్యాష్ లేదు.. కార్డు పనిచేయదు..

By:  Tupaki Desk   |   4 Dec 2016 6:57 AM GMT
క్యాష్ లేదు.. కార్డు పనిచేయదు..
X
దేశాన్ని నగదు రహితంగా మార్చేస్తామని మోడీ చెబుతుంటే వ్యాలట్లు - పర్సులు అంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలకూ అందుకు వంతపాడుతున్నారు. కానీ.... అసలు క్యాష్ లెస్ ఎకానమీకి మనం ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నామని ప్రశ్నించుకుంటే తెల్లమొఖం వేయాల్సిందే. అంతవరకు ఎందుకు... తాజాగా నోట్లు అందుబాటులో లేకపోవడంతో కార్డుల వినియోగం పెరగడంతో ఎదురవుతున్న సమస్యలు చూస్తే చాలు క్యాష్ లెస్ ఎకానమీకి మనం ప్రిపేర్డ్ గా ఉన్నామో అర్థమైపోతుంది. నగదు లేకపోవడంతో అంతా డెబిట్ - క్రెడిట్ కార్డులు వాడుతున్నారు... దీంతో ఒక్కసారిగా తాకిడి పెరిగి బ్యాంకుల సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీంతో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం - బ్యాంకులు - ఎటిఎంలలో నగదు కొరత నేపధ్యంలో ఆన్‌ లైన్ కొనుగోళ్లకు సిద్ధపడిన ప్రజలకు బ్యాంకు సర్వర్లు చుక్కలు చూపిస్తున్నాయి. ఆన్‌ లైన్‌ లో కొనుగోలు చేసిన వస్తువుల బిల్లుల చెల్లింపులకే కాకుండా దుకాణాల్లో కొనుగోళ్ల అనంతరం స్వైపింగ్ యంత్రాల ద్వారా బిల్లు చెల్లిద్దామంటే అవి కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు మండిపడుతున్నారు.

బ్యాంకుల నుంచి నగదు ఉప సంహరణపై పరిమితులు- కొద్ది మొత్తమైనా తీసుకుందామని బ్యాంకుల వద్ద కనిపిస్తున్న భారీ క్యూలు - ఎటిఎం వద్ద కనిపిస్తున్న నో క్యాష్ బోర్డులతో జనం డెబిట్ - క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లకు సిద్ధపడగా సమస్య తలెత్తుతోంది. అవసరమైన వారికి నగదు బదిలీ కోసం నెట్ బ్యాంకింగ్‌ లో ప్రయత్నిస్తే అక్కడ సైతం సర్వర్ బిజీ అన్న సమాధానం వస్తోంది.

కాగా సర్వర్ల ప్రస్తుత సామర్థ్యానికి మించి 200 శాతం అధికంగా వాటిపై లోడ్ పడుతోందట. నగదు ఉపసంహరణ పరిమితి తగ్గడంతో ఆన్‌ లైన్ కొనుగోళ్లు, స్వైపింగ్ యంత్రాల ద్వారా చెల్లింపులకు ప్రజలు సిద్ధపడటంతో సర్వర్‌పై సామర్థ్యానికి మించి రద్దీ పెరిగింది. దీంతో అవి మొరాయిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/