Begin typing your search above and press return to search.

ఐఆర్ సీటీసీ మాదిరి మరిన్ని ఆఫర్లు అవసరం

By:  Tupaki Desk   |   23 Nov 2016 4:08 AM GMT
ఐఆర్ సీటీసీ మాదిరి మరిన్ని ఆఫర్లు అవసరం
X
ప్రధాని ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయంతో ‘చిల్లర’ కష్టాలు ఎంత చికాకుగా ఉంటాయో దేశ ప్రజలకు ఇట్టే అర్థమయ్యాయి. 15 రోజుల క్రితం చిల్లర నోట్లను పర్సులో ఉంచుకోవటానికి చికాకు పడిపోయిన జనానికి.. అదే చిల్లర నోట్ల కోసం పాట్లు పడేలా చేశారు మోడీ. రద్దు నిర్ణయం నేపథ్యంలో జనాలు పడుతున్న బాధల నేపథ్యంలో.. దానికి అవసరమైన సొల్యూషన్లు ఇచ్చే కన్నా.. ఎవరికి వారు తమ రాజకీయ స్వార్థంతో వ్యవహరించటమే కనిపిస్తుంది.

సాహసోపేతమైన రద్దు నిర్ణయంతో ‘మార్పు’ కోసం దశాబ్దాలుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న దేశ ప్రజలకు అనుకోని వరంలా ప్రధాని మోడీ ప్రసాదించారని చెప్పాలి. సుఖం.. సౌకర్యం ఏదీ ఉత్తినే రాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. మోడీ తీసుకున్న నిర్ణయంతో తాత్కాలికంగా చికాకులు.. ఇబ్బందులు ఎదురైనా.. అంతిమంగా మాత్రం సామాన్యుడికి మాత్రం లాభం కలగటం ఖాయం. అయితే.. రద్దు కారణంగా ఎదురవుతున్న చికాకుల్ని వీలైనంతగా తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదన ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

రద్దు నేపథ్యంలో కొన్నింటి విషయాల్లో మినహాయింపుల్ని ప్రకటించిన ప్రభుత్వం.. అరకొర అన్నట్లు కాకుండా.. వీలైనంత ఎక్కువగా ఉపశమనాల్ని ప్రకటించటం ద్వారా..రద్దుతో ఇబ్బందులే కాదు.. ప్రయోజనాలు కూడా ఉన్నాయన్న భావన కలిగేలా చేయాలి. తాజాగా ఐఆర్ సీటీసీ ఇలాంటి నిర్ణయాన్నే ప్రకటించింది. దేశంలో ఏర్పడిన చిల్లర సమస్యను తీర్చేందుకు.. నగదు రహిత లావాదేవీల్ని మరింత పెంచేందుకు వీలుగా కొత్తనిర్ణయాన్ని తీసుకుంది.

తన ద్వారా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సేవల్ని వినియోగించే వారికి సేవా రుసుం లేదని ప్రకటించింది. ఈ నెల 23 నుంచి డిసెంబరు 31 వరకు ఈ నిర్ణయం అమల్లోకి ఉంటుందని ప్రకటించింది. ఐఆర్ సీటీసీ ద్వారా రైల్వే టికెట్లతో పాటు.. విమాన టికెట్లు.. హోటల్.. ఆన్ లైన్ కొనుగోళ్లు చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి ప్రయోజనాలు మరికొన్నింటిని ప్రభుత్వం ప్రకటించటం ద్వారా.. రద్దు నిర్ణయంతో నష్టాలే కాదు లాభాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయాల్సిన అవసరం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/