Begin typing your search above and press return to search.

ఒక కూలీ తరఫున డజనుమంది సీనియర్‌ లాయర్లా?

By:  Tupaki Desk   |   14 April 2015 8:07 AM GMT
ఒక కూలీ తరఫున డజనుమంది సీనియర్‌ లాయర్లా?
X
కంటికి కనిపించేవే నిజాలు కావన్న మాట ఎర్రచందనం కూలీల కేసులో కనిపిస్తోంది. శేషాచల అడవుల్లో ఎన్‌కౌంటర్‌కు గురైన ఒక సాదాసీదా దొంగ తరఫున వాదించేందుకు.. డజను మంది సీనియర్లు రంగ ప్రవేశం చేయటం.. డీఎస్పీ స్థాయి అధికారి మృతుడి సతీమణితో మాట్లాడే అవకాశం లేకపోవటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ఎర్రచందనం కూలీలు అన్న ట్యాగ్‌తో అందరి మనసుల్లో సానుభూతి సంపాదించుకుంటున్న వారి వెనుక అదృశ్య శక్తులు చాలానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 20 మందిలో శశికుమార్‌ అనే అతను ఉన్నాడు. అతను కూలీగా అభివర్ణిస్తున్నారు. ఇతగాడి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఇతడి భార్య మునియమ్మాళ్‌ను ఏపీ హైకోర్టు సుమోటోగా ఇంప్లీడ్‌ చేసి.. లాయర్‌ను పెట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోతే తామే లాయర్‌ను ఏర్పాటు చేస్తామని కోర్టు చెప్పింది.

మునియమ్మాళ్‌ పరిస్థితిని చూసి కోర్టు ఈ విధంగా స్పందిస్తే.. వాస్తవం మరోలా ఉంది. ఆమె చిత్తూరు జిల్లా చంద్రగిరికి వచ్చారు. ఆమెతో మాట్లాడేందుకు డీఎస్పీ ఆమెను కొన్ని ప్రశ్నలు వేసే ప్రయత్నం చేశారు. దీన్ని అడ్డుకుంటూ డజను మంది సీనియర్‌ న్యాయవాదులు చెన్నై నుంచి ప్రత్యేకంగా రావటం పోలీసు వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

ఒక సాదాసీదా దొంగ (కూలీ అని చెప్పే వారి మాట ప్రకారమైతే కూలీ) తరఫున డజను మంది న్యాయవాదులు వాదించేందుకు ప్రత్యేకంగా రావాల్సిన అవసరం ఏంటి? వారంతా ఫీజులేకుండానే వాదిస్తున్నారా? ఇంత భారీ స్థాయిలో ఇంతమంది రావటం వెనుక మర్మం ఏమిటి? సదరు మహిళను సాదాసీదా ప్రశ్నలు వేసినా.. ఆమో నోటి నుంచి సమాధానాలు రాకుండా లాయర్లు ఎందుకంత ఉత్సాహాన్ని ప్రదర్శించారు? లాంటి ప్రశ్నలు ఇప్పుడు మనసును తొలిచేస్తున్నాయి.

ఒక మృతుడి తరఫున పన్నెండుమంది లాయర్లు రావటం.. సదరు మహిళ నోటి నుంచి ఒక్క మాట కూడా రానివ్వకుండా చూస్తున్న వైఖరిపై ఏపీ పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు తమిళనాడు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. కూలీలుగా చెబుతున్న వారి వెనుక బడా స్మగ్లర్లు ఉన్నారన్న సందేహాలు ఇప్పుడు పెరుగుతున్నాయి.

తమిళనాడులో భావోద్వేగాల్ని స్పృశించటం ద్వారా.. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకున్నా.. వాటిని భావోద్వేగంతో అడ్డుకునేందుకు తాజా ఎన్‌కౌంటర్‌ మీద ఇంత రచ్చ చేస్తున్నారా? ఎర్రచందనం ఇష్యూలో పోలీసులు పట్టించుకోకుండా ఉండేందుకే ఇంత రార్థాంతం అవుతుందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి మానవహక్కుల నేతలు బదులిస్తారా? లేక.. కూలీలు అంటూ దొంగల్ని వెనకేసుకు వస్తున్న నేతలు సమాధానం చెబుతారా?