Begin typing your search above and press return to search.

పంగనామాలకు భయపడుతున్న వెంకయ్య

By:  Tupaki Desk   |   5 July 2015 12:16 PM GMT
పంగనామాలకు భయపడుతున్న వెంకయ్య
X
ప్రాసలతో మాట్లాడే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అమెరికాలోని డెట్రాయిట్‌ లో జరుగుతున్న తానా మహాసభల్లోనూ తన ప్రాసల ప్రసంగంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. తానా మహాసభల్లో ఆయనకు జీవితకాల సాఫల్య పురష్కారాన్ని అందించారు. అలాగే తానా సభలకు అనుబంధంగా నిర్వహించిన వ్యవసాయ సదస్సులోనూ వెంకయ్య మాట్లాడారు.

హిందూత్వ అంటే మతం కాదని... అది భారతీయ జీవన విధానమని చెప్పిన ఆయన దేశం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన కులమతాలకు అతీతంగా దేశం కోసం ఆలోచించాలన్నారు. అడ్డు నామమా... నిడువు నామమా ఏ నామం పెట్టుకున్నామన్నది ముఖ్యం కాదు... దేశానికి పంగనామాలు పెట్టకపోతే చాలు అంటూ అందరినీ నవ్వించారు. అయితే... దీనిపై సోషల్‌ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. సీనియర్లకు పంగనామాలు పెడుతున్న బీజేపీలో ఇప్పటికే సీనియరుగా మారి మరింత సీనియరవుతున్న వెంకయ్యనాయుడు తనకు భవిష్యత్తులో పంగనామం పెట్టద్దని పార్టీ నేతలను కోరారా... లేకుంటే నిజంగానే దేశాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నారా అంటూ సోషల్‌ మీడియాలో దీనిపై సెటైర్లు పడుతున్నాయి.

తాను పురస్కారాలకు వ్యతిరేకినని.. తన జీవిత కాలంలో ఏనాడూ పురస్కారం తీసుకోలేదని.. తానా చేస్తున్న సేవలకు ముచ్చటపడి వారిస్తున్న లైఫ్‌ టైం అచీవ్‌ మెంటు అవార్డు అందుకున్నట్లు చెప్పారు. అయితే.. తన తొలి, చివరి పురస్కారం ఇదే కానుందన్నారు.

ఈ సభలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ అందరూ తనను మౌనముని అంటుంటారని... కానీ తనను తాను మహా మౌనమునిగా అనుకుంటానని చమత్కరించారు. కార్యక్రమంలో సినీ నిర్మాత సురేశ్‌ బాబు, స్పీకర్‌ కోడెల తదితరులు పాల్గన్నారు.